కొంతమంది హీరోయిన్స్ కళ్లతోనే కబుర్లు చెబుతారు .. చూపులతోనే పడుచు మనసులకు పాఠాలు నేర్పుతారు. మరికొంతమంది నవ్వుతోనే మనసులు కొల్లగొడతారు .. గుండె గోదాముల్లో కలల రాసులు నింపుతారు. ఇలాంటి లక్షణాలన్నీ ఒకే అమ్మాయిలో కనిపిస్తే .. జక్కన చెక్కిన శిల్పానికి ఒకటి రెండు సొగసులు అదనంగా జోడిస్తే ఆ పిల్లే కృతిశెట్టి అవుతుందనేది కుర్రాళ్లంతా కూడబలుక్కుని చెప్పిన మాట. తెలుగులో ఆమె తొలిచిత్రమైన ‘ఉప్పెన’ ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది.

‘ఉప్పెన’ సినిమా విడుదల కాకముందే ఈ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. రానున్న రోజులన్నీ ఈ దానిమ్మ మొగ్గవేనని భావించిన దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఒక వైపున పాత్రలను .. మరో వైపున పారితోషికాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతోంది. అలా ఇటీవలే నాని జోడీగా ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా చేయడానికి అంగీకరించింది. ఆ తరువాత సినిమాను సుధీర్ బాబుతో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంలో నిజమెంతోనని అనుకున్నారు.
సుధీర్ బాబు సినిమాను కృతిశెట్టి చేయనుందనే వార్తలో నిజం ఉందనే విషయం స్పష్టమైపోయింది. ఈ రోజు అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా ఈ విషయం ఖాయమైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. కృతి శెట్టి చేసిన సినిమా ‘ఉప్పెన’ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా అలాగే ఉంది. ఈ అమ్మాయికి అవకాశాలు మాత్రం ఉప్పెనలా వచ్చిపడుతున్నాయి. అందానికి అదృష్టం తోడైతే ఇలాగే ఉంటుంది మరి!











