టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏపీ హై కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు చికిత్స కోసం హైదరాబాద్ వచ్చారు.. బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌లో దిగిన ఆయనను భారీ ర్యాలీతో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు.. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కోసం వైద్యులను సంప్రదించారు.. ఇటు, నేడో రేపో చంద్రబాబు తన కంటి చికిత్స కోసం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లనున్నారు.. అక్కడ వైద్యుల సూచనల మేరకు ట్రీట్ మెంట్ తీసుకోనున్నారు.
హైదరాబాద్‌కి చేరుకున్న చంద్రబాబుని పలువురు రాజకీయ నేతలు, కుటుంబ సభ్యులు, బంధువులు పరామర్శిస్తారని ప్రచారం జరుగుతోంది.. ఈ లిస్టులో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం పరామర్శిస్తారనే మీడియాలో కథనాలు వస్తున్నాయి.. దాదాపు 52 రోజులపాటు జైలులో ఉన్న బాబు ఆరోగ్యం కాస్త దెబ్బతిన్నది.. అందుకే, ఆయనని పరామర్శించాలనే భావనలో ఉన్నారట కేటీఆర్..
ఇది కేవలం ఆత్మీయ పరామర్శ కాదని, దీనివెనక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. బాబు అరెస్ట్ తర్వాత కేటీఆర్ పలు భిన్న కామెంట్స్ చేశారు.. తన కామెంట్స్‌పై తానే యూ టర్న్ తీసుకున్నారు.. టీడీపీ అధినేత అరెస్ట్‌తో హైదరాబాద్‌లో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ర్యాలీలు, నిరసన సభలు చేశారు.. వీటిని తప్పు పట్టారు కేటీఆర్.. ఏపీలో చేసుకోవాలని, హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం అని వ్యాఖ్యానించారు.. ఇవి టీడీపీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయి.. ఈ కామెంట్స్ రాజకీయంగా బీఆర్ఎస్కి శాపంగా మారాయి.. పార్టీకి జరిగిన డ్యామేజ్‌తో హరీష్ రావు, కవిత వాటిని కవర్ చేసే ప్రయత్నం చేశారు.. ఇటు, కేటీఆర్ కూడా వివరణ ఇచ్చారు.. అయినా, గత పదేళ్లుగా బీఆర్ఎస్, కేసీఆర్‌తో ఉన్న సీమాంధ్ర సెటిలర్లు.. ఈ దఫా షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.. ఇదే బీఆర్ఎస్ని కలవరపెడుతోంది..
సీమాంధ్ర సెటిలర్లు తెలంగాణలో కాంగ్రెస్‌కి దగ్గరవుతారనే భయమే బీఆర్ఎస్ నేతలకు కలవరపెడుతోంది.. అందుకే, చంద్రబాబు నాయుడిని పరామర్శించడానికి కేటీఆర్ వెళ్లనున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.. గతంలో కేటీఆర్ రాజకీయాల్లో బాగా రాణిస్తాడని తనకి సూచించిందే చంద్రబాబు అని కేసీఆర్ ఓ ఇంటర్ వ్యూలో వెల్లడించారు.. ఇది కూడా చంద్రబాబుపై కేటీఆర్‌కి సానుకూలత ఉండే అంశం.. మరి, చంద్రబాబు పరామర్శతో టీడీపీ అభిమానుల మనసు మారుతుందా.?? బీఆర్ఎస్కి ఓటేస్తారా.? లేదా అనేది చూడాలి..