రాజకీయాలు అంటే కేవలం ఓటుబ్యాంక్ సమీకరణాలు కావని, బడుగు బలహీన వర్గాలను అధికారపీఠంపై కూర్చోబెట్టే ఆత్మగౌరవ ప్రయాణమని కూటమి ప్రభుత్వం మరోసారి నిరూపించింది. జనాభాలో సగం..కూటమి ఇచ్చింది కొండంత బలం అనే నినాదంతో సాగుతున్న జయాహో బీసీ కార్యక్రమం ఇప్పుడు కొత్త రికార్డులకు శ్రీకారం చుడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో BC రిజర్వేషన్ల కోటాపై కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ, పొలిటికల్ ఫ్లాట్‌ఫామ్‌పై BC సోదరులకు ఇచ్చే ప్రాధాన్యతలో వెనక్కి తగ్గేదే లేదని కూటమి సర్కార్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పులతో సంబంధం లేకుండా, రాబోయే స్థానిక పోరులో కనీసం 34 శాతానికి పైగా పార్టీ టికెట్లను BC అభ్యర్థులకే కేటాయిస్తామని TDP తేల్చిచెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మరోవైపు, ప్రజాక్షేత్రంలో గెలిచే ధైర్యం లేక జగన్ మోహన్ రెడ్డి మార్క్ కోర్టు రాజకీయాలు చేస్తున్నారు. రాబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ బృందం కొత్త మెలికలతో కోర్టులను ఆశ్రయిస్తోంది. పరిపాలనాపరమైన అడ్డంకులు సృష్టించి, ఎన్నికల ప్రక్రియను స్తంభింపజేయడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో BC రిజర్వేషన్లను 34% నుంచి 24%కి తగ్గించి బీసీల పొట్టకొట్టిన వైసీపీ, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో బీసీలు గెలిచి సర్పంచులు, ఎంపీపీలుగా ప్రమాణం చేస్తే తమ ఉనికి గల్లంతవుతుందనే భయంతో లీగల్ డ్రామాలు ఆడుతోంది.
ఈ కుట్రల వెనుక ఉన్న అసలు పొలిటికల్ మైండ్ గేమ్‌ను కూటమి నేతలు ఎండగడుతున్నారు. గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేయడం ద్వారా కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు, పే కమిషన్ నిధుల కింద రావలసిన దాదాపు రూ. 12,000 కోట్ల భారీ మొత్తాన్ని నిలిపివేయడమే జగన్ రెడ్డి పన్నుతున్న రాజకీయ కుట్ర అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు కొల్లు రవీంద్ర, సవిత తదితర బీసీ నేతలు ధ్వజమెత్తారు. నిధులు ఆగిపోయి పల్లెల్లో అభివృద్ధి స్తంభిస్తే, ఆ నెపాన్ని ప్రభుత్వంపైకి నెట్టాలనే దిగజారుడు ఆలోచన వైసీపీది అని మండిపడ్డారు.
వైసీపీ ఎన్నిన్యాయపరమైన మెలికలు పెట్టినా, ప్రజాస్వామ్య వ్యవస్థను స్తంభింపజేసే కుట్రలు పన్నినా.. బీసీలకు ఇచ్చే 34 శాతం రాజకీయ ప్రాతినిధ్యంలో కూటమి వెనకడుగు వేయదని నేతలు స్పష్టం చేశారు. జగన్ టీమ్ పన్నుతున్న రూ. 12,000 కోట్ల నిధుల కుట్రలను, స్థానిక సంస్థల అడ్డంకులను దాటుకుని జయాహో బీసీ నామసంవత్సరంలో కూటమి జెండా పల్లెల్లో ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.











