కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్ లలో మెజారిటీ వాటాలను అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీకి బదలాయించేందుకు జరిగిన తతంగంలో వైవీ విక్రాంత్ రెడ్డి కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైవీ సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డి… సీఎంగా ఉన్న అన్నను చూసుకుని అక్రమాలకు తెర తీసిన నేతగా ఏపీ ప్రజలకు చిరపరచితులే. విశాఖ కేంద్రంగా మన్యం కొండల్లోని విలువైన ఖనిజాలను తరలించడంలో తనదైన శైలి చక్రం తిప్పిన ఈయన…కాకినాడ సెజ్ షేర్ల బదలాయింపులో కీలక మరింతగా బరి తెగించిన వైనం ఇటీవలే వెలుగు చూసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సీఐడీ అధికారులు కేసునమోదు చేయగా… అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ కేసులో బాధితుడిగా ఉన్న కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు)ఎంట్రీ ఇచ్చి.. జూనియర్ వైవీకి షాకిచ్చారు. విక్రాంత్ రెడ్డి తనను నానా ఇబ్బందులు పెట్టారని, ఈ కేసులో అతడే ప్రధాన నిందితుడని పేర్కొన్న కేవీ రావు… అతడికి బెయిల్ ఇస్తే కేసులోని కీలకసాక్ష్యాలను తారుమారు చేస్తాడని ఆరోపించారు.
ముందస్తు బెయిల్ పిటిషన్లను సాధారణంగా బాధితులు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే…అప్పటికే తామిచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదయ్యాయన్న భావనతో వారు తమకు తాముగా కోర్టు మెట్లు ఎక్కేందుకు సాహసించరు. అంతేకాకుండా కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తులు ముందస్తు బెయిల్ కోరే హక్కు కలిగి ఉంటారు కూడా. అయితే విక్రాంత్ రెడ్డి వ్యవహారంలో మాత్రం కేవీ రావు… విక్రాంత్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టును ఆశ్రయించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. విక్రాంత్ ముందస్తు బెయిల్ పిటిషన్ లో తనను ఇంప్లీడ్ చేసుకోవాలని కోర్టును కోరిన కేవీ రావు.. విక్రాంత్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేముందు తన వాదనలను సైతం వినాలంటూ కోర్టును అభ్యర్థించారు. వెరసి విక్రాొంత్ కు కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా ఉండేలా కేవీ రావు పకడ్బందీగా అడుగులు వేస్తున్నారని చెప్పక తప్పదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే… విక్రాంత్ కు ఈ కేసులో ముందస్తు బెయల్ లభించే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి.
కేవీ రావు తన ఇంప్లీడ్ పిటిషన్ లో ఏమేం వాదనలు వినిపించారన్న విషయానికి వస్తే… అసలు కాకనాడ సీ పోర్టు గానీ, కాకినాడ సెజ్ షేర్ల బదలాయింపు గానీ… ఈ మొత్తం వ్యవహారంలో విక్రాంత్ రెడ్డిదే కీలక భూమిక అని ఆయన కోర్టుకు వివరించారు. తనను, తన కుటుంబ సభ్యులను విక్రాంత్ రెడ్డి బెదిరించారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ కారణంగా తనతో పాటు మొత్తం తన కుటుంబం తీవ్రమైన మానసిక క్షోభ అనుభవించిందని ఆయన తెలిపారు. విక్రాంత్ బెదిరింపుల కారణంగా షేర్లను బదలాయించి… తనతో పాటుగా తన కుటుంబ సభ్యులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని తెలిపారు.
అసలు ఈ కేసులో అందరికంటే కూడా విక్రాంత్ రెడ్డిదే కీలక పాత్ర అని ఆరోపించారు. కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న విక్రాంత్ కు బెయిల్ ఇస్తే… కేసు తీవ్ర ప్రభావానికి గురి అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విక్రాంత్ కు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఒకవేళ విక్రాంత్ కు బెయిల్ ఇవ్వాలని అనిపిస్తే… ముందుగా తన వాదనలు వినాలని ఆయన కోర్టును కోరారు. ఈ కారణంగా తనను ఈ కేసులో ఇంప్లీడ్ చేసుకోవాలని కేవీ రావు కోర్టును కోరారు. కేవీ రావు పిటిషన్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంటే… విక్రాంత్ కు బెయిల్ దొరకడం కష్టమేనని చెప్పక తప్పదు.