పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కా మాస్ పాత్రలో ‘భీమ్లా నాయక్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 07:02 గంటలకు ‘లాలా భీమ్లా’ పేరుతో సౌండ్ ఆఫ్ భీమ్లా వీడియో ప్రోమోను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా చేయి అందించారు. దీనికి మాటలు రాయడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చినట్టు సమాచారం.
ఎస్. ఎస్. తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలను కూడా విడుదల చేశారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ పవర్ స్టార్ అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. రెండు రకాల టీజర్స్ ను కూడా విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. కాకపోతే రెండు పాన్ ఇండియా చిత్రాలైన ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ లతో పోటీ పడి ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఎంతవరకు సమంజసం అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరి నుంచి మహేష్ బాబు సర్కారువారి పాట తప్పుకుంది.
మరి పవన్ కూడా పక్కకు వెళ్లిపోతారా? వాటితో ఢీ అంటే ఢీ అంటారా? అనే అనుమానాలు ఉన్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే ఆ రెండు పాన్ ఇండియా చిత్రాలతో ‘భీమ్లా నాయక్’ పోటీ పడటమే సముచితమని అనిపిస్తోంది. ఎందుకుంటే పాన్ ఇండియా చిత్రాలైన ఆ రెండు చిత్రాలూ వేర్వేరు జోనర్ లలో రూపొందాయి. ప్రేక్షకులు కూడా వైవిధ్యం కోరుకునే అవకాశం ఉంది. అందువల్ల ఆ భారీ తనం నుంచి కొంత రిలీఫ్ రావాలంటే భీమ్లానాయక్ లాంటి పక్కా మాస్ ఫార్ములా చాలా అవసరం. ఆ సినిమాలు హిట్ అయినా దీని ప్రేక్షకులు దీనికి ఉంటారు. కాకపోతే థియేటర్ల సమస్య మాత్రం ఏర్పడుతుంది.
ఆ ఒక్క సమస్య లేకపోతే సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు కాబట్టి వెనక్కి తగ్గేది లేదన్నది స్పష్టమవుతోంది. ఈ సాయంత్రం విడుదల చేయబోయే లాలా భీమ్లా నాయక్ వీడియో చెప్పబోయే విషయానికి సంబంధించి పవర్ స్టార్ తో ఓ ప్రత్యేక పోస్టర్ కూడా విడుదల చేశారు. తనదైన మాస్ లుక్ తో పవర్ స్టార్ కూర్చుని ఉన్న లుక్ ఇది. ఆయన ముందు మందు బాటిల్, జిలెటిన్ స్టిక్స్ కూడా ఉన్నాయి. మొహాన బొట్టు కూడా ఉంది. ఇంకేనేం ఆక్కడే ఆయన ఓ పాట ఎత్తుకునే అవకాశం కూడా ఉంది. అది కూడా ఏ జానపద బాణీయో కావచ్చు. మరి ఈరోజు విడుదల కాబోయేది పాటా లేదా టీజరా అన్నది వేచి చూడాలి.
Must Read ;- పుష్ప న్యూ టీజర్ ఎలా ఉండబోతుందో తెలుసా?











