ఆ లాయర్ సాబ్ ఇంకెవరు షకలక శంకరే. మనం ఊహించినట్టుగానే ‘లాయర్ సాబ్’ పాత్రధారి మీద క్లారిటీ వచ్చేసింది. ఇది కేవలం కవర్ ట్రైలర్ మాత్రమే. ఒకవేళ అలా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో. కవర్ ట్రైలర్ అనే పదం కొత్తగా ఉందా.. కవర్ సాంగ్ లు వస్తున్నప్పుడు కవర్ ట్రైలర్ లు రావడంలో తప్పేముంది. అందుకే ఎస్.కె. ఫిలిమ్స్ అధినేత సురేష్ కొండేటి ఈ కవర్ ట్రైలర్ రూపొందించారు. ఈ లాయర్ పాత్ర కోసం షకలక శంకర్ ను అడగ్గానే అంగీకరించారట. దీని వెనక దర్శకత్వ పర్యవేక్షణ చేసిన మరో వ్యక్తి కూడా ఉన్నారండోయ్. ఆయన మరెవరో కాదు ‘టు ప్లస్ వన్’ దర్శకుడు కాచిడి గోపాల్ రెడ్డి. ‘వకీల్ సాబ్’ ప్రమోషన్ లో భాగంగానే ఈ కవర్ ట్రైలర్ ను వీరు రూపొందించారు.
మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ తరుణంలో ఈ లాయర్ సాబ్ కు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. అంతటా ఇప్పుడు వకీల్ సాబ్ ఫీవర్ అలుముకుని ఉంది. బాలీవుడ్ చిత్రం ‘పింక్’ రీమేక్ గా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇటీవల వకీల్ సాబ్ ట్రైలర్ చూడగానే సురేష్ కొండేటికి ఈ కవర్ ట్రైలర్ ఆలోచన వచ్చిందట. వెంటనే అమల్లో పెట్టేశారు. వకీల్ సాబ్ కు ఏమాత్రమూ తీసి పోకుండా ఉండేలా ఈ లాయర్ సాబ్ ట్రైలర్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ కొసరు ట్రైలర్ అసలు ట్రైలర్ ను మించి పోతుందా, తానే మునిగిపోతుందా అన్నది చూడాలి. దాదాపు నాలుగు నిమిషాల నిడివితో ఈ ట్రైలర్ రూపొందడం విశేషం. ఈ ట్రైలర్ క్లిక్ అయితే ఇలాంటి కవర్ ట్రైలర్ లు మరికొన్ని విడుదలయ్యే అవకాశం లేకపోలేదు. అన్నట్టు ఈ ట్రైలర్ విడుదలకు ముందు ఓ టీజర్ ను కూడా విడుదల చేశారండోయ్. ‘మిస్ ప్రణవి.. ఆర్ యు వర్జిన్?’ అంటూ ప్రకాష్ రాజ్ పోలిన నందా పాత్రధారి ప్రశ్నించే సన్నివేశంతో టీజర్ ను కట్ చేశారు. మొత్తానికి ఈ కవర్ ట్రైలర్ చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమంటారో చూడాలి.











