ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలే అరకొర సిబ్బంది. దీనికి తోడు కొందరు డాక్లర్లు ప్రైవేటు ప్రాక్టీసులు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను వారి క్లినిక్‌లకు తరలిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో గడచిన రెండు రోజుల్లోనే ఏడుగురు కరోనా రోగులు చనిపోయారు. ఇవాళ జరిగిన 3 కోవిడ్ మరణాల గురించి తెలిసి MLA సిద్దారెడ్డి సందర్శనకు వచ్చారు. కోవిడ్ మరణాలకు ఆసుపత్రి సిబ్బంది, MLA సిద్దారెడ్డి బాధ్యత వహించాలని, ఏ కొరత వల్ల కోవిడ్ రోగులు మరణించారో తెలియజేయాలని CPI, CPM సంయుక్తంగా ధర్నా నిర్వ హించి MLA సిద్దారెడ్డి వాహనానికి అడ్డుపడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టగా MLA సిద్దారెడ్డి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు ముగ్గురు మాత్రం తాపీగా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తూ ఐసీయూ బెడ్లు ఖాళీ ఉన్నా, బెడ్లు లేవంటూ రోగులను అనంతపురం సమగ్ర ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఇక ఈ ముగ్గురు డాక్టర్లు సొంతగా ప్రైవేటు ప్రాక్టీసు చేసుకుంటూ జనాన్ని దోచుకుంటున్నారని రోగులు విమర్శిస్తున్నారు. రోగులు వీరి ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చేందుకు జస్ట్ డయల్‌లో కూడా వీరు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచడం సంచలనంగా మారింది.
ఆ ముగ్గురు..
కదిరి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్ గాయత్రి క్లినిక్ పేరుతో ప్రైవేటు ఆసుపత్రి నిర్వహించుకుంటున్నారు.తనకు కరోనా పాజిటివ్ అని అబద్దాలు చెబుతూ విధులకు కూడా హాజరు కావడం లేదని తెలుస్తోంది. కేవలం ప్రైవేటు వైద్యం చేసుకుంటూ లక్షలు ఆర్జిస్తున్నాడని రోగులు తెలిపారు.ఇక డాక్టర్ మోహన్ నాయక్. ఈయన ఎముకల వైద్య నిపుణులు. కదిరి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే ప్రతి ఒక్కరినీ త్రివేణి ప్రైవేటు ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నాడని సమాచారం. ఎందుకంటే ఆ ఆసుపత్రిలో మోహన్ పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను పనికట్టుకుని త్రివేణి ఆసుపత్రికి తరలించడమే పనిగా పెట్టుకున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇక డాక్టర్ మధుసూధన్.సొంతగా ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఈయన కూడా పెద్దగా విధులకు హాజరుకావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. సొంత క్లినిక్ నడపడంపైనే సమయమంతా వెచ్చిస్తున్నాడు. అయితే ఈ ముగ్గురు మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వదలరు, అలాగని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయరు. డాక్టర్లు ఇంత బరితెగించినా చర్యలు తీసుకోకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి.











