సుస్వర సంగీత సురఝరీ గమనం… ఆయన గానం.. అందుకే ఆయన పాట మధురామృతం… అది ఏ స్వరమైనా ఆయన స్వరంతో పలికితే వినవచ్చే మాధుర్యం వేరు. ఇలాంటి ఆణిముత్యాలు కొందరికే దొరకుతాయి. బాలు ఓ ఆణిముత్యం అని మొట్టమొదటగా గ్రహించిన వ్యక్తి కోదండపాణి. మనసే అందాల బృందావనం.. ఇది మల్లెల వేళయనీ…, ఎన్నాళ్లో వేచిన ఉదయం.., నాగమల్లి కోనలోనా.., కోటలోని మొనగాడా… విశాల గగనంలో చందమామా.., రా వెన్నెల దొరా.. మనసా కవ్వించకే నన్నిలా.. వంటి అద్భుత బాణీల స్వరరాజు కోదండపాణిని మన బాలు ప్రత్యేకంగా ఆకర్షించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మహమ్మద్ రఫీ, కె.జె.ఏసుదాస్, వాణీ జయరాంలను పరిచయం చేసినట్లుగానే బాలును కూడా ఆయనే పరిచయం చేశారు.
ఒక రకంగా బాలు ఆయనకు దత్త పుత్రుడు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గళాన్ని కోదండపాణి తొలిసారిగా మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ లో విని ఆయన గళంలోని మాధుర్యాన్ని గమనించారు. అనేకమంది నిర్మాతలకూ, సంగీత దర్శకులకూ బాలును పరిచయం చేస్తూనే ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో ‘ఏమి ఈ వింత మోహం..’ అనే పాట పాడే అవకాశం కల్పించారు. బాలు ఆరోగ్యం, దుస్తులు వంటి అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. గాయకుడిగా బాలు ఎదుగుతుంటే పుత్రోత్సాహాన్ని కోదండపాణి అనుభవించారు. దత్త పుత్రులు మేలు మరుస్తారు కానీ బాలు ఆయనను మరువకుండా తనను గాయకుడు చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారో గుర్తించి కోదండపాణి రికార్డింగ్ థియేటర్‌ను మద్రాసులో నిర్మించారు.
ఆ ‘బాలు’డిలో సంగీతం పాలు ఎంతో…
ఐదు దశాబ్దాలు వెనక్కి వెళితే… అది 1964వ సంవత్సరం. మద్రాసులో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ లో సంగీత పోటీలు జరుగుతున్నాయి. న్యాయమూర్తులు ఎవరో కాదు సంగీత దర్శక త్రిమూర్తులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు. పాటలు పాడిన వారిలో ఓ ‘బాలు’డు ప్రథమ బహుమతి కొట్టేశాడు. ఆ కుర్రాడిది లేలేత గొంతు… ఆ గొంతులో ఓ ప్రత్యేకత. ప్రేక్షకులలో కూర్చున్న ఓ సంగీత దర్శకుడికి ఆ కుర్రాడి ప్రతిభ అర్థమైంది. ఆయనే కోదండపాణి. ఆ బాలుడే మన బాలు. గుంటూరులో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో శ్రీపతి పండితారాధ్యుల నందయ్య, రాజేశ్వరీ దేవి దంపతులకు బాలు జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచి హార్మోనియం మీద, నాటకాల్లో పద్యాలు పాడటం మీద ఉన్న ఆసక్తి,అభిరుచి కారణంగా చదువు ముందుకు సాగలేదు. తొమ్మిదో తరగతిలోనే చదువుకి స్వస్తి పలికేశాడు. తన వేలికున్న ఉంగరాన్ని అమ్మించేసి మద్రాసు రైలెక్కేలా చేసింది. కోదండపాణి కంటపడేలా చేసింది మాత్రం సంగీత పోటీలే.
ఆ గుంపులో గోవిందయ్యలా…
గాయకుడిగా బాలు జీవితం నల్లేరు మీద బండినడకలా ఏమీ సాగలేదు. మొదట ఆయన స్థానం కోరస్ లోనే. దీన్నే మనం గుంపులో గోవిందయ్య అన్నాం. నాలుగేళ్లపాటు ఆయన జీవితం అలానే గడిచింది. నిదానంగా సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, మాస్టర్ వేణు, కె.వి. మహదేవన్ లకు సహాయకుడిగా మారారు. 1966లో ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రం ద్వారా పాటపాడే అవకాశాన్ని కోదండపాణి ఆయనకు ప్రసాదించారు. అంతే బాలు ఇంక వెనుతిరిగి చూసుకోలేదు.
ఆయన సంగీతాన్ని ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. అయినా రాగ తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండడంతో ట్యూను ఒకసారి వింటే యాధాతథంగా పాడగలిగే శక్తిని భగవంతుడే బాలుకు ఇచ్చాడనుకోవాలి. ఆరో దశాబ్దానికి చేరువవుతున్నా బాలు గళంలో అదే రసవాహిని ఉప్పొంగుతోంది. ఆ గానమాధుర్యం అంబరాన్నంటింది. ఆబాల గోపాలాన్ని కట్టిపడేసి సమ్మోహనాశక్తి బాలు గళానికే కాదు… ఆయన వ్యక్తిత్వానికీ ఉంది. ఒకటా రెండా… ఆయన పాటలకు అంతే లేదు. ఈ స్వర యుగానికి ఆయనే కర్త, కర్మ, క్రియ అనడంలో అతిశయోక్తి లేదు. ఆస్పత్రిలో ఉన్న బాలు మళ్లీ కోలుకుని గళం విప్పాలని వేవేల గొంతులు స్వరార్చన చేస్తున్నాయి. ఆయన పాటలనే సంజీవని మంత్రంగా జపిస్తూ ప్రార్థనలు చేస్తున్నాయి.