పూరి జగన్నాథ్ సినిమా వస్తుందంటేనే అందరిలోనూ భారీ అంచనాలు ఉంటాయి. దానికి తోడు విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా లైగర్ రూపొందింది. ఈ సినిమా గురువారం విడుదలైంది. శరవేగంగా సినిమాలను ప్రేక్షకులకు అందించే పూరి ఈసారి మాత్రం ఆలస్యంగా తన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మరి ఈ లైగర్ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
కథలోకి వెళితే..
కరీంనగర్ నుంచి తన కుమారుడు లైగర్ ను వెంటబెట్టుకుని ముంబైకి వచ్చిన మహిళ బాలామణి కథ ఇది. లైగర్ తండ్రి బలరామ్ కూడా ఓ ఫైటరే. కానీ సినిమాలో ఆ పాత్ర కనిపించదు. మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో లైగర్ (విజయదేవరకొండ)కు శిక్షణ ఇప్పించి అతన్ని ఫైటర్ గా తీర్చిదిద్దాలన్నది బాలామణి (రమ్యకృష్ణ) కల. అందుకు ఓ కోచ్ కావాలి కాబట్టి తన భర్తకు పరిచయమున్న కోచ్ (రోనిత్ రాయ్) వద్దకు తీసుకువెళుతుంది. ఈ క్రమంలో తానియా (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు లైగర్. అతనికి నత్తి ఉందన్న కారణంగా వీరి ప్రేమ బెడిసికొడుతుంది. ఆమె మీద కోపంతో రగిలిపోయిన లైగర్ లో కసి పెరుగుతుంది. ఎంఎంఏలో ఎందరినో ఓడించి నేషనల్స్ కు వెళతాడు. ఆ తర్వాత ఇంటర్నేషల్ పోటీకి వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన ఇబ్బందులేమిటి? వాటిని అతను ఎలా అధిగమించాడన్నదే కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
లైగర్ గా తన పాత్రకు విజయ్ దేవరకొండ న్యాయం చేశాడు. అతనికి ఉన్న నత్తిని మాత్రం జనం రిసీవ్ చేసుకోలేకపోయారు. లవ్ ట్రాక్ అంతా ప్రథమార్థంలో నడిపి ద్వితీయార్థంలో ఇంటర్నేషనల్ పోటీ మీద దృష్టి కేంద్రీకరించాలని పూరి భావించాడు.తానియాగా అనన్య గ్లామర్ తో ఆకట్టుకున్నా ఈ పాత్రను జనం రిసీవ్ చేసుకోవడం కష్టం. కేవలం హీరో పాత్ర మీదే ఫోకస్ పెట్టి మిగిలిన పాత్రలను దర్శకుడు విస్మరించాడు. దాంతో కథనం పేలవంగా తయారైంది. యాక్షన్ సన్నివేశాలు తప్ప సినిమాలో చెప్పుకోతగ్గ అంశం ఏమీ లేదు. ప్రథమార్థంలోనే కథ కొద్దిగా గాడి తప్పిందని అనుకుంటే ద్వితీయార్థంలో పూర్తిగా గాడి తప్పింది. సినిమాలో పూరి మార్క్ పంచ్ డైలాగులు గానీ, బలమైన విలనిజంగానీ కనిపించలేదు.
పాటలు కూడా బాగోలేదు. కొన్ని సన్నివేశాలు చూస్తే అమ్మనాన్న తమిళ అమ్మాయి గుర్తుకు వస్తుంది. కనీసం తండ్రి పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఉంటే బాగుండేదేమో. సినిమాలో ఎమోషన్ మిస్సవడం కూడా ఈ సినిమాకు మైనస్ అనాలి. లైగర్ తల్లిగా రమ్యకృష్ణను సరిగా ఉపయోగించుకోలేదు. అక్కడక్కడా ఆమె నటన అతిగా అనిపిస్తుంది. మైక్ టైసన్ ఇందులో ఏదో చేస్తాడనుకుంటే కేవలం బఫూన్ మాదిరిగా ఆ పాత్ర తయారైంది. గెటప్ శీను తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ పీక్స్ లో ఉంటుందనుకుంటే పూర్తిగా వీక్ అయ్యింది. ఆ తర్వాత పాట పెట్టి సినిమా ఇంకా అవలేదన్న భ్రమ కల్పించారు. ఒక దశలో అసలు ఇది పూరి డైరెక్షన్ లో రూపొందిన సినిమాయేనా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పూరి మార్కుకు బదులుగా ఆయన కెరీర్ రిమార్కు చిత్రం అనాలి.
నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మకరంద్ దేశ్ పాండే, రమ్యకృష్ణ, మైక్ టైసన్, విషు రెడ్డి, రోనిత్ రాయ్, గెటప్ శీను తదితరులు.
సంగీతం: విక్రమ్ మొంత్రోస్, తనీష్క్ బాగ్చి, లియో జార్జ్, డీజే చీతాస్, సునీల్ కశ్యప్, జాని
నేపథ్య సంగీతం: సునీల్ కశ్యప్
కెమెరా: విష్ణుశర్మ
నిర్మాతలు: ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, హిరు యశ్ జోహార్
రచన – దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల తేదీ : ఆగస్టు 25
ఒక్క మాటలో: పూరి మార్క్ కాదు రిమార్క్
రేటింగ్-2/5