ఏపీకి రాజధాని ఏది?… అసలు ఏపీకి ఉన్నది ఓకే రాజధానా?… లేదంటే మూడు రాజధానులాా?… గడచిన ఐదేళ్లలో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఏపీ సర్కారు తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. ఏపీకి ఏకైక రాజధాని అమరావతేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఓ అఫిడవిట్ ను దాఖలు చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులన్న మాటే వినబడని విధంగా గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చర్యలు చేపడతామని కూడా ఆయన తెలిపారు. ఈ మేరకు గతంలో అమరావతి రైతులకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివవేయాలని సీఎస్ తన అఫిడవిట్ లో సుప్రీంకోర్టును కోరారు. వెరసి ఏపీ రాజధాని ఏది అన్న ప్రశ్నలు ఇకపై ఉత్పన్నం కాని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్ ను క్లిస్టర్ క్లియర్ గా దాఖలు చేసింది.
2019 ఎన్నికల్లో విజయం వైసీపీకి విజయం దక్కడంతో ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతల చేపట్టి… తన ఇష్టారాజ్యంగా పాలనను సాగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పటిదాకా అమరావతే రాష్ట్ర రాజధాని అని చెప్పిన జగన్… తాను సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత మాట మార్చేశారు. అప్పటిదాకా అమరావతిలో జరుగతున్న నిర్మాణ పనులన్నింటినీ నిలిపేాశారు. అంతటితో ఆగకుండా… అమరావతి కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉంటుందని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను మారుస్తామని, ఇక న్యాయ రాజధానిగా కర్నూలుకు కొత్త శోభనిస్తామని తెలిపారు. ఈ ప్రకటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఇక అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అయితే ఏకంగా నిరవధిక నిరసనలకు తెర తీశారు. జగన్ సర్కారుపై న్యాయ పోరాటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారి పోరాటంలో న్యాయముందని గ్రహించిన హైకోర్టు… అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తీర్పు చెప్పింది. అంతేకాకుండా… 6 నెలల వ్యవధిలోనే రాజధానిని పూర్తి చేయాలని ఆదేశాాలు జారీ చేసింది.
ఈ తీర్పుపై నాటి జగన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ తాము మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చామని తెలిపింది. ఈ పిటిషన్ పై విచారణ అలా కొనసాగుతూనే ఉండగా… మొన్నటి సార్వత్రిక ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పిన రాష్ట్ర ప్రజలు తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమిని గెలిపించుకోవడం జరిగిపోయింది. ఫలితంగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయడు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. వచ్చీ రాగానే అమరావతి నిర్మాణంపై దృష్టి సారించిన చంద్రబాబు… నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో రూ.26 వేల కోట్లను కేవలం నెలల వ్యవధిలోనే సమీకరించగలిగారు. ప్రస్తుతం అమరావతిలో ఓ పండగ వాతావరణం నెలకొనేలా చేశారు.
ఇలాంటి పరిస్థితిలో జగన్ సర్కారు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడివిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ లో సీఎస్ పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. గతంలో హైైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. అయితే 6 నెలల వ్యవధిలోనే అన్నీ చేయాలంటే కుదరదన్న విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రానున్న 3 ఏళ్ల కాలంలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా హైకోర్టు చెప్పినట్లుగానే రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్ల ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని వివరించారు. సచివాలయం, శాసన సభ, హైకోర్టు తదితరాలకు శాశ్వత భవనాలు అందుబాటలోకి రాగానే… ప్రస్తుతం వాటి కోసం నిర్మించిన భవనాలను ఇతరత్రా అవసరాల కోసం వినియోగిస్తాని తెలిపారు. గతంలో చెప్పినట్లుగా రాజధానిలో 9 సిటీలను అభివృద్ధి చేస్తామని సీఎస్ తెలిపారు. వెరసి రాజధానిపై మొన్నటి దాకా షికార్లు చేసిన పుకార్లకు సీఎస్ ఫుల్ స్టాప్ పెట్టేశారు.