శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండ్యపల్లి వద్ద ఘోరప్రమాదం చోటుచేసుకుంది.ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడిన ఘటనలో ఐదుగురు మహిళలు సజీవదహనం కాగా,మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనలో ఆటో మంటల్లో కాలి బూడిదయ్యింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతులు గుడ్డంపల్లి, పెద్దకోట్ల వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, కుమారిగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది వ్యవసాయ కూలీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నా లోకేష్.. మృతులకు నివాళులు అర్పించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదానికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడిన దొంగలు కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయని మండిపడ్డారు. ఇంకా నయం.. కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పలేదని ఎద్దేవా చేశారు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయిందని లోకేష్ అసహనం వ్యక్తం చేశారు.