ఏపీ పోలీసులు ప్రస్తుతం మరింత అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. ఏదేనీ కేసులో నిందితులు ఉన్న సామాన్యులైనా, రాజకీయ నేతలైనా… వారిపై ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఫుల్ క్లారిటీతో వెళుతున్నారు. అంతేకాదండోయ్.. ఆయా చర్యలను అమల్లో పెట్టేస్తున్నారు కూడా. సోమవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో చోటుచేసుకున్న ఓ ఘటనను చూస్తుంటే… ఈ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి, మొన్నటిదాకా ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణా రెడ్డిని ఎయిర్ పోర్టు పోలీసులు నిలిపేశారు. సుదీర్ఘ విచారణలో భాగంగా తాను విదేశాల నుంచి వస్తున్నానని ఆయన చెప్పడంతో పోలీసులు ఆయనను హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతించారు.
అసలు సజ్జలను ఢిల్లీ ఎయిర్ పోర్టు పోలీసులు ఎందుకు అడ్డగించారన్న వివరాల్లోకి వెళితే… సజ్జలపై లుక్ అవుట్ నోటీసు జారీ అయ్యిందట. ఓ వ్యక్తిపై లుక్ అవుట్ నోటీసు జారీ అయ్యిందంటే… ప్రపంచంలోని ఏ ఎయిర్ పోర్టుకు వెళ్లినా పోలీసులు అడ్డగించడం సర్వసాధారణం కదా. ఈ తరహా లుక్ అవుట్ నోటీసులు కడరు గట్టిన నేరస్తులు, తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు, ఉగ్రవాదులు వంటి వారిపై ఆయా దేశాట పోలీసులు జారీ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి నోటీసును సజ్జలపై ఎందుకు జారీ చేశారన్నదే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ కీలకమైన రాజకీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగానే కాకుండా.. ఏకంగా ఐదేళ్ల పాటు ప్రభుత్వ పదవిలో కొనసాగిన సజ్జల… అంతకుముందు సుదీర్ఘకాలం పాటు జర్నలిస్టుగానూ పనిచేశారు. అలాంటి సజ్జలపై ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం ఆసక్తి రేకెత్తించేదే.
వైసీపీ జమానాలో ఆ పార్టీ శ్రేణులు పలు విధ్వంసాలకు పాల్పడ్డారరని ఇటీవలే అదికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కారు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనల్లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దా*డి, సీఎం చంద్రబాబు ఇంటిపై దా*డికి యత్నం కీలకమైనవి. ఇప్పటికే ఈ రెండు కేసుల దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తూ కూటమి సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పటికే ఈ కేసు దర్యాప్తును కొనసాగించిన పోలీసులు… మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేశారు. తాజాగా టీడీపీ కార్యాలయంపై దా*డి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పానుగంటి చైతన్య సోమవారం కోర్టులో లొంగిపోాయారు. అయితే ఈ ఘటనకు సజ్జల ప్రోత్సాహం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే విషయాన్ని కేసు డైరీలోనూ రాశారు. దీంతో ఎక్కడ తనను పోలీసులు అరెస్ట్ చేస్తారోనన్న భయంతో సజ్జల హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆధారం చేసుకుని సజ్జలపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేసినట్లుగా సమాచారం. మొత్తంగా ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరు కూడా తప్పించుకోకుండా ఏపీ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లుగా ఈ ఘటనతో తేలిపోయింది.