‘ప్రేమ’ అంటే రెండు మనసుల కలయిక .. ‘పెళ్లి’ అంటే రెండు కుటుంబాల వేడుక అనే విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల గతంలో ఎంతో అందంగా ఆవిష్కరించాడు. పాత్రలతో కాకుండా ఆ పాత్రల మనసులతో మాట్లాడించడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన కథలు అందరి హృదయాలకి పట్టుబడతాయి .. అనుభూతుల తీరంలో పరుగులు పెడతాయి. తనకి బాగా అలవాటైన ప్రేమకథనే ఈ సారి కూడా ఎంచుకున్న ఆయన, నాగచైతన్య – సాయిపల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ రూపొందిస్తున్నారు.
‘దీపావళి’ పండుగ సందర్భంగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. అందంగా అలంకరించబడిన వివాహ వేదిక .. ఆ వేదికపై పెళ్లి కొడుకుగా చైతూ .. పెళ్లి కూతురుగా సాయిపల్లవి కనిపిస్తున్నారు. తమ ప్రేమ ఫలించిందనే సంతోషం ఆ ఇద్దరి కళ్లలోనూ ప్రతిఫలిస్తోంది. ఈ పోస్టర్ ను బట్టి .. నాయికా నాయకుల ప్రేమ .. పెళ్లి పీటలపై సుఖాంతం అవుతుందనే అనిపిస్తోంది. ‘దీపావళి’ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ట్విట్టర్ నుంచి చైతూ వదిలిన ఈ పోస్టర్ బాగానే ఆకట్టుకుంటోంది.
పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా కోసం యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శేఖర్ కమ్ముల – సాయిపల్లవి కాంబినేషన్లో ‘ఫిదా’ తరువాత వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆత్రుత కనిపిస్తోంది. శేఖర్ కమ్ములకు .. సాయిపల్లవికి .. చైతూకి ప్రేమకథలు బాగా కలిసొచ్చాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరూ దృష్టిపెట్టారు. ‘ప్రేమ’ అనే రెండు అక్షరాలు పాతవే అయినా, అవి తిరిగే మలుపులు .. సాధించే గెలుపులు కొత్తగా ఉంటాయి గనుక, ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది.











