బిగ్ బాస్ హౌస్ లో ప్రేమించుకుందాం రా సినిమా చూపించేస్తున్నారు. చివరికి అది పెళ్లిచేసుకుందాం రా దాకా వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ల కన్నా ఈ ప్రేమవ్యవహారాల మీద చాలా మంది దృష్టి ఉంది. ఈ హౌస్ లో రాముడు మంచి బాలుడు లాగా పేరు తెచ్చుకున్నాడు అభిజిత్. టైటిల్ రేస్ లో దూసుకుపోతున్న వారిలో అభిజిత్ కూడా ఉన్నాడు. ఒక విధంగా ఇక్కడ ప్రేమ వ్యవహారాలు నడిపితే ఎలిమినేట్ కాకుండా ఉండొచ్చేమో అన్న అభిప్రాయం కలుగుతోంది.
ఎందుకంటే చూసేవారికి కూడా అదే కావాలి మరి. దీనివల్ల టీఆర్పీ కూడా పెరుగుతుంది. అభిజిత్ ఈ హౌస్ లో అడుగుపెట్టడానికి అర్హత అతనికి అతను నటించిన సినిమాలే సంపాదించి పెట్టాయి. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో అభి కెరీర్ ప్రారంభమైంది. అభి విషయంలో ఇప్పుడు అనుకోవాల్సింది ఏమిటంటే లవ్ ఎట్ ఫస్ట్ హౌస్ అని. హారికతో అతను నిండా ప్రేమలో మునిగిపోయాడు. ఈ జంట ప్రేమ పీక్ లో ఉన్నట్టే. ఇక ఇంకో జంటలోకి వద్దాం. వీళ్లు అఖిల్, మోనాల్.. వీరిద్దరూ అభిజిత్, హారికల కన్నా రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు.
మూడో జంట అవినాష్, అరియానా. ఈ జంటలు బయటికి వస్తే ఇంకేమైనా ఉందా? ఇంతకీ వీరి ప్రేమ ఫలిస్తుందా? ఇంట్లో పెద్ద వాళ్లు ఒప్పుకుంటారా? లేదా ఇది రైలు ప్రయాణం లాంటి ప్రేమ అనుకోవాలా? ఇవన్నీ ప్రశ్నలే. మోనాల్ గుజరాతీ అమ్మాయి కావడం ఓ మైనస్. ససేమిరా ఆమెను తాము ఒప్పుకునేది లేదంటోంది అఖిల్ అమ్మ. మరి అభిజిత్ అమ్మ ఏమంటోందో చూద్దాం. ఈడూ జోడూ బాగుందనే అభిప్రాయం అభి ఇంట్లో ఉందట. తమ కుమారుడు నోట్లో వేలు పెట్టినా కొరకలేని వాడని వాళ్ల అమ్మ అభిప్రాయం.
అభి బయటకొచ్చాక ఐ లవ్ యూ ఓ హారిక.. నీ ప్రేమకే జోహారిక అంటాడో.. మొహం చాటేస్తాడో చూడాల్సిందే. ఇంతకుముందెప్పుడూ తమ పుత్రరత్నానికి లవ్ ఎఫైర్స్ లేవంటోంది అభి తల్లి. హారిక కోడలైతే తమకు ఓకే అన్నట్టుగా వీరు ప్రస్తుతం కలరింగ్ ఇచ్చేస్తున్నారట. మొత్తానికి అభి బయటికి వచ్చాక హారికతో ఫిక్స్ అయిపోతుందేమో అన్న అనుమానాలూ ఉన్నాయి. మరి ఈ మూడు జంటల్లో ఒకరు తప్పకుండా విన్నర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయంలో అభికే ఎక్కువ ఓట్టు పడేలా ఉన్నాయి.











