తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గగా, నాగార్జునసాగర్‌లో భారీగా పోలింగ్ జరిగింది. తిరుపతి పార్లమెంటు పరిదిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 55 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. నాలుగు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రచారం నిర్వహించినా ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాప్తిస్తూ ఉండటం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇక వేలాది మంది ఉద్యోగాలు, కూలీ పనుల కోసం వలస వెళ్లడంతో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
భారీగా దొంగ ఓట్లు, రిగ్గింగ్
తిరుపతి, శ్రీకాళహస్తిలోని 150 పోలింగ్ కేంద్రాల్లో భారీగా దొంగ ఓట్లు వేసినట్టు తెలుస్తోంది, చిత్తూరు, రాజంపేట, నెల్లూరు ప్రాంతాల నుంచి బస్సులు, కారుల్లో వేలాది మందిని దొంగఓట్లు వేసేందుకు తరలించారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు పరిధిలో వలస వెళ్లిన ఉద్యోగులు, కూలీల ఓటరు కార్డులు సేకరించిన వాలంటీర్లు, దొంగ ఓట్లు వేసేందుకు అద్దె మనుషులను చిత్తూరు నుంచి తరలించారని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. తిరుపతిలో భారీగా దొంగఓట్లు వేశారని ఇలాంటి ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలు రద్దు చేయాలని ఆయన ఈసీకి లేఖ రాశారు. ఇక బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు కూడా తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశాయి.
తిరుపతిలో అరాచకం
తిరుపతి నగరంలో మంత్రి పెద్దిరెడ్డికి చెందిన ఓ కళ్యాణ మండపంలో దొంగ ఓట్లు వేసేందుకు బస్సులో తెచ్చిన 5 వేల మందికి బస ఏర్పాటు చేశారని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. పుంగనూరు వీరప్పన్ మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన తరహాలో ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేశారని లోకేష్ దుయ్యబట్టారు. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచే సత్తా లేకనే వైసీపీ నేతలు రిగ్గింగ్, దొంగఓట్లు వేసి, తీవ్ర అరాచకాలకు తెరతీశారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
సాగర్‌లో భారీ పోలింగ్
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సీరియస్ గా తీసుకోవడంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. నాగార్జునసాగర్‌లో 84.32 శాతం ఓటింగ్ నమోదైంది. గణాంకాలు అప్ డేట్ చేసేసరికి ఇది ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలవడం తెరాసకు తప్పనిసరి కాగా, సాగర్ గెలుపు ద్వారా మనుగడ నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, సాగర్‌లో పాగా వేసేందుకు బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో సాగర్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బు పంచడం కూడా ఓటింగ్ శాతం పెరడానికి దారి తీసిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీల వద్ద నుంచి డబ్బు తీసుకుని ఓట్లు వేయకపోతే తరవాత నిలదీసే ప్రమాదం ఉండటంతో ఓట్లు వేసేందుకు సాగర్‌లో ఉదయం నుంచే క్యూల్లో నిలబడ్డారు. హైదరాబాద్ వలస వెళ్లిన కూలీలు కూడా ఓటు వేసేందుకు వచ్చారు. దీంతో సాగర్‌లో భారీ పోలింగ్ నమోదైంది.
Must Read ;- ప్రజాస్వామ్యం ఖూనీ : తిరుపతి ఉప ఎన్నికల్లో పోటెత్తిన దొంగఓటర్లు











