ఉత్తర ప్రదేశ్లో జరిగిన రెండు వరుస గ్యాంగ్ రేప్ ఘటనలు ఉలిక్కిపడేలా చేశాయి. హాథ్రస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశమంతటా నిరసనలు వెల్లువెత్తుతుండగానే మరో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం అక్కడ మహిళా భద్రతను ప్రశ్నార్థకం గా మార్చింది. దేశ రాజధాని ఢిల్లీకి సరిగ్గా 200 కిలోమీటర్ల దూరం. ఆ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఓ దళిత యువతిపై నలుగురు మృగాళ్లు అదును చూసి ఒక్కసారిగా దాడి చేశారు. ఆమె నోరు మూసి, దుపట్టాను మెడకు బిగించి గడ్డి పొదల్లోకి లాక్కెళ్లారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను తీవ్రంగా కొట్టి హింసించారు. నాలుకను కోసేసి పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు తీసుకోవడంలో జాప్యం చేశారని ఆరోపిస్తూ దళిత సంఘాల ఆధ్యర్వంలో ఇప్పటికే ఆందోళనలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్లో ఇటీవలి కాలంలో వరుసగా సామూహిక అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటుండడంతో అక్కడి ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఇష్యూపై తమ వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ, సీనియర్ నటి మాధురీ దీక్షిత్ తన ట్విట్టర్ ద్వారా హాథ్రస్, బాల్రాంపూర్ సంఘటనల గురించి విని షాక్ అయ్యాను. బాధితులు కుటుంబాల కోసం ప్రార్ధిస్తున్నాను. అంతేకాదు నేరం చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ కేసులో నేరస్థులకి త్వరగా శిక్ష పడేలా చూడాలి. మన సమాజంలో పిల్లలు, మహిళలు ఇలాంటి దారుణమైన సంఘటనలకు గురికావడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా అధికారులతో చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైన ఉందని మాధురీ పేర్కొంది. ఆమె ట్విట్ కు నెటిజన్ల నుండి మంచి స్పందన వస్తోంది. అత్యంత హేయమైన రీతిలో ఆమెపై లైంగిక దాడి చేసిన ఉన్నత వర్గానికి చెందిన నలుగురు నిందితులకు కఠిన శిక్ష వేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు.