Mahasamudram Movie Review
శర్వానంద్, సిద్దార్థ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మహా సముద్రం’. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ సినిమాని నిర్మించారు. చాలా కాలం హిట్ లకు దూరంగా ఉన్న శర్వానంద్, సిద్ధార్థలకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? ఆర్ ఎక్స్ 100 సినిమా దర్శకుడిగా అజయ్ భూపతికి రెండో హిట్ లభించింది? అన్నది చూద్దాం.
కథలోకి వెళితే..
అజయ్ (శర్వానంద్) జీప్ యాక్సిడెంట్ తో కథ ఫాష్ బ్యాక్ లోకి వెళుతంది. అజయ్, విజయ్( సిద్దార్థ) ఇద్దరూ మంచి స్నేహితులు. విజయ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ కావాలనుకుంటాడు. అతను అనాథ. అర్జున్ కు తల్లి, మేనమామ చుంచుమామ ( జగపతిబాబు) ఉంటారు. సమాజంలో అన్యాయం జరిగితే ఎదుర్కొనే మనస్తత్వం అర్జున్ ది. డ్యాన్స్ మాస్టర్ మహాలక్ష్మి (అదితిరావు హైదరి)తో విజయ్ ప్రేమలో పడతాడు. అనుకోకుండా ధనుంజయ్ అనే స్మగ్లర్ ను చంపి అతన్నుంచి ప్రాణ భయం ఉండటంతో విజయ్ ఆ ఊరు వదిలి పారిపోతాడు. దాంతో తన మిత్రుడు ప్రేమించిన మహాలక్ష్మి బాధ్యలను అర్జున్ తీసుకుంటాడు.
చనిపోయాడనుకున్న ధనుంజయ్ బతికి వచ్చి విజయ్ ప్రేమించిన మహాలక్ష్మిని చంపాలనుుకుంటాడు. దాన్ని అర్జున్ అడ్డుకుంటాడు. ఆ ప్రయ్నతంలో అర్జున్ చేతిలో ధనుంజయ్ చనిపోతాడు. ఈ పరిణామాలతో అర్జున్ కూడా స్మగ్లర్ అవతారమెత్తుతాడు. ధనుంజయ్ చనిపోవడంతో అతని అన్న గూని బాబ్జీ ( రావు రమేష్) చేతిలోకి తమ్ముడి సామ్రాజ్యం వెళ్లిపోతుంది. చివరికి అర్జున్, గూని బాబ్జీల మధ్య వార్ మొదలవుతుంది. మేనమామ చుంచు మామ అండదండలతో ఎదిగిన అర్జున్ జీవితంలో ఇంకా ఎలాంటి పరిణామలు జరిగాయి? చివరికి ఈ కథ ఎలా ముగిసిందన్నదే ఈ మహాసముద్రం.
Mahasamudram Movie Review
ఎలా తీశారు? ఎలా చేశారు?
ట్విస్టులు ఎక్కువైతే టేస్ట్ లేకుండా పోతుందనడానికి అద్దం పట్టే కథనం ఇది. అంతా తనలో దాచుకునే మహాసముద్రంగా శర్వానంద్ ను ఊహించుకోవల్సింది ఉంటుంది. అతనికి అనూ ఇమ్మాన్యుయేల్ తో ప్రేమ వ్యవహారం అసంపూర్ణంగా ముగిసిపోతుంది. మంచి ఫ్రెండ్ అనుకున్నవాడు దూరమైతాడు. అసలు కథలోకి తీసుకు వెళ్లడానికి దర్శకుడు చాలా శ్రమపడ్డాడు. భారంగా కథనం సాగుతుంది. సినిమాలో రెండు మూడు సన్నివేశాలు తప్ప చెప్పుకోడానికి ఏమీ లేదు. లవ్ ట్రాక్ లు కూడా పట్టాలు తప్పాయి. అలా ఎందుకు తప్పించాలనకున్నారో దర్శకుడికే తెలియాలి. అన్ని సినిమాలు ఇలాగే ముగుస్తాయి కాబట్టి మనం ఈ దారిలో వెళదాం అనుకుని ఉండవచ్చు.
పోనీ చేతన్ భరద్వాజ్ పాటల ద్వారానో, రీరికార్డింగ్ ద్వారానో ఊరట కలుగుతుందనుకుంటే అదీ లేదు. నటన పరంగా శర్వానంద్, సిద్ధార్థ బాగా నటించినా సినిమాలో విషయం లేకపోతే ఏమీ చేయలేం. దానికి ఈ సినిమానే ఉదాహరణ. తండ్రిలో మహాలక్ష్మి పడే ఇబ్బందులు కథకు అసందర్భంగా అనిపించాయి. ఇలా ఒక్కటి కాదు ఇందులో ఇంకా ఎన్నో ఉన్నాయి. పోనీ జగపతి బాబు ఉన్నారు విలనిజం పండిస్తారనుకుంటే అదో బఫూన్ పాత్ర మాదరి మారిపోయింది. ఏ పాత్రకూ న్యాయం జరగలేదు. సినిమా రంగంలో దర్శకుల పరంగా ఓ సెంటిమెంటు ఉంది. దాని పేరే ద్వితీయవిఘ్నం.
అజయ్ భూపతి విషయంలో కూడా ఇది నిజమైందని అనుకోవాల్సి వస్తోంది. కథ పక్క దారి పట్టడం ఒక ఎత్తు అయితే, కథను ఆకట్టుకునేలా చెప్పడం మరో ఎత్తు. ఈ రెండు విషయాల్లోనూ దర్శకుడి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇతనేనా ఆర్ఎక్స్ 100 సినిమా చేసింది అని కూడా అనిపించక మానదు. అటు క్లాస్ ఆడియన్స్ కూ, ఇటు మాస్ ఆడియన్స్ కూ నచ్చని సినిమాగా చెప్పాల్సి ఉంటుంది. ఈ సినిమాలో చెప్పుకోతగ్గ అంశం ఏదైనా ఉంది అంటే అది ఇంటెర్వెల్ ముందు వచ్చే ఫైట్ మాత్రమే. అంతకుమించి ఈ సినిమాలో చెప్పుకోతగ్గ అంశం ఏదీ లేదు. పోనీ సంభాషణల పరంగా చూసినా ఏమీ లేదు.
మహాసముద్రంలో అన్నీ తనలో దాచుకుంటుందని డైలాగ్ ద్వారా చెప్పించారు. అలాగే హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ శర్వానంద్ తో చెప్పే డైలాగ్ ఒకటుంది. అన్ని నదులూ సముద్రంలో కలుస్తాయి. కానీ కొన్ని నదులకు ఆ అదృష్టం ఉండదు’ అంటుంది. మహా అంటే మహాలక్ష్మిని సముద్రంలాంటి అర్జున్ కలుపుకోవడం వల్ల ఇది మహాసముద్రం మూవీ అయ్యిందని మనం సరిపెట్టుకోవాల్సిందే.
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, జగపతి బాబు, శరణ్య తదితరులు
సాంకేతికవర్గం: సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: రాజ్ తోట, ఎడిటింగ్: ప్రవీణ్ కెఎల్, పాటలు: భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్, కిట్టు విస్సాప్రగడ
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
దర్శకత్వం: అజయ్ భూపతి
నిర్మాణం: ఏకే ఎంటర్ టైన్ మెంట్స్
విడుదల తేదీ: 14-10-2021
ఒక్క మాటలో: మహాసముద్రంలో ఉప్పు తక్కువైంది.
రేటంగ్: 2/5