భారీవర్షాల తాకిడికి హైదరాబాదు నగరం అల్లకల్లోలం అయిపోయింది. నగరం మొత్తం నీటిమడుగు అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. కూలిన ఇళ్లు, ధ్వంసమైన రోడ్లు, ఎందుకు పనికి రాకుండా పోయిన వాహనాలు, వీటన్నింటినీ మించి పోయిన ప్రాణాలను వీటన్నింటినీ లెక్క కడితే.. ఈ భారీవర్షాల తాకిడికి వాటిల్లిన నష్టం వేల వేల కోట్ల రూపాయలు ఉంటుందనడంలో సందేహం లేదు.
హైదరాబాదు నగరం ఇంత దారుణంగా దెబ్బతినడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని.. తిరుగులేని మెజారిటీతో రెండోసారి గద్దె మీద కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజానీకం, ఈ వరదల తాకిడికి తీవ్రంగా ఈసడించుకున్నారు. హైదరాబాదు నగర కార్పొరేషన్ పరిస్థితికి వస్తే.. ఏకంగా వంద సీట్లతో నగర పరిపాలనను గులాబీ దళాలకు అప్పజెప్పిన ప్రజలు- వరద నష్టం నివారణ, బాధితులకు అండగా ఉండే విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను తప్పుపట్టారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రతిచోటా ప్రజలనుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురైందంటే.. ఏ ఒక్క ఎమ్మెల్యేకు ప్రజల నుంచి తిట్లు, దూషణలు, శాపనార్థాలు తప్పలేదంటే.. వైఫల్యం ఏ స్థాయిలో ఉందని ప్రజలు నమ్ముతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. నగరం అతలాకుతలం అయిపోతోంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ దాటి అడుగు బయటపెట్టకపోవడం కూడా దారుణం. అదే సమయంలో.. డీఫ్యాక్టో ముఖ్యమంత్రి స్థాయిలో వ్యవహరించే కేటీఆర్.. మంత్రి హోదాలో నగరంలో పర్యటించారు గానీ.. ప్రతిచోటా ప్రజలనుంచి తీవ్ర నిరసనలు చవిచూశారు.
కేవలం అధికార్లతో సమీక్ష సమావేశాలకు, సదరు సమావేశాల్లో అద్భుతంగా ప్రజలను ఆదుకుంటున్నాం అనే ప్రకటనలకు ఆయన పరిమితం అయ్యారు. ఏ రకంగా చూసినా.. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల కళ్లకు కొట్టొచ్చినట్టు కనిపించాయి.
ప్రముఖుల విరాళాలు గొప్పవి..
హైదరాబాదు నగరం దెబ్బతిన్న తీరు.. పలువురు ప్రముఖులను కదిలించింది. వదాన్యులు ముందుకొచ్చారు. భారీ విరాళాలు అందజేశారు. మెగా క్రిష్ణారెడ్డి పదికోట్లు, మైహోం గ్రూపు నుంచి జూపల్లి రామేశ్వరరావు అయిదు కోట్లు విరాళాలు ప్రకటించారు. సినీ ప్రముఖుల్లో నాగార్జున ట్వీట్ తో విరాళాల పర్వం ప్రారంభం అయింది. చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, త్రివిక్రమ్.. ఈ వరుసలో అనేక మంది ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.
పనిలోపనిగా భజన..
విరాళాలు చాలా మంది ప్రకటించారు గానీ.. కొందరు ఈ సందర్భాన్ని తమ వ్యక్తిగత ప్రయోజనాలకు లబ్ధికి ఒక మెట్టుగా వాడుకున్నారా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఈ విరాళం ప్రకటించడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వం చాలా అత్యద్భుతంగా చేస్తున్నదని… ప్రజలకు మెరుగ్గా సేవలందిస్తున్నారని.. ఇలా.. పొగడడానికి నాగార్జున, మహేష్ బాబు ఈ సందర్భాన్ని వాడుకున్నారు. మామూలు పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ వారి ప్రయత్నాల్ని అభినందించడం మంచి పద్ధతే.
కానీ, ఈ సందర్భంలో అచ్చంగా వైపరీత్యం మొత్తం అధికార పార్టీ వైఫల్యమే అని అందరూ నమ్ముతున్న వేళ.. ఇలా స్పందించడం చిత్రమైన సంగతి. సినిమా కంటె వ్యాపారాల్లో ఎక్కువ చురుగ్గా ఉండే నాగార్జున గానీ, తన సినిమాలు పైరసీ అయినప్పుడు తప్ప సామాజిక సమస్యలపై స్పందించే అలవాటు లేని మహేష్ బాబు గానీ.. ఏం చూసి ప్రభుత్వం చేస్తున్న కృషికి కితాబులు ఇచ్చారో అర్థం కాని సంగతి. ప్రభుత్వం వారికి ఏమైనా స్వప్రయోజనాల ఆశలున్నాయేమో.. అందుకోసమే కాసింత విరాళాలు ప్రకటించి, మరింత ప్రభుత్వాన్ని కీర్తించి పనులు చక్కబెటట్ుకోడానికి ఇలాంటి వ్యూహరచనతో ఉన్నారేమో అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.
వారికి ప్రభుత్వం కనిపించింది.. ప్రజలు కనిపించలేదు..
ఈ సెలబ్రిటీలు ఇప్పుడు ప్రభుత్వాన్ని కీర్తించడం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ సుమారు వారం రోజులుగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నప్పుడు వీరిలో ఒక్కరు కూడా నోరు మెదపలేదు ఎందుకు? ప్రభుత్వంలో చురుకు పుట్టించడానికి పెదవి విప్పలేదు ఎందుకు? ప్రజల కష్టాలను చూడకుండా, లోతుగా పరిస్థితిని చూసి, వైఫల్యం ఎక్కడ ఉన్నదో కనీసం విశ్లేషించుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. ప్రజల ఆగ్రహానికి గురవుతున్న ప్రభుత్వం గురించి నాలుగు మంచి మాటలు చెప్పేసి.. వారికి మైలేజీ ఇచ్చేయాలని నాగార్జున, మహేష్ బాబు లాంటి వారు ఆత్రుత పడుతున్నారా? అనేది సంశయంగా ఉంది.
ప్రభుత్వానికి భజన చేసుకోవడం వారి వారి ఇష్టం..
కానీ, ప్రజల కష్టాల గురించి కూడా సమానంగా స్పందించాలనే.. పేదలనుంచి వేడికోలు.
సీఎం పేరిట విరాళాలు ఇవ్వడం ఓకే.. కానీ ప్రజల కష్టాలకు స్పందించి మాటాడినప్పుడు ప్రజలు తమను మరింతగా ప్రేమిస్తారని ఈ సెలబ్రిటీలు తెలుసుకోవాలి.