కరోనా కారణంగా సినీ పరిశ్రమ పరిస్థితి దారుణంగా తయారైంది. లాక్ డౌన్ వల్ల దేశంలో సినిమా థియేటర్స్ కూడా మూతపడ్డాయి. దాదాపు ఏడు నెలల తర్వాత అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సినిమా థియాటర్స్ తెరుచుకోవడాని అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా థియేటర్స్ తెరుచుకోవడాని అనుమతి ఇచ్చినా ప్రొడ్యూసర్లు, డిస్టిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదు.
అయితే తమిళనాడులో దీపావళి సందర్భంగా సినిమా థియేటర్స్ తెరవడానికి చూస్తున్నారు అక్కడి డిస్టిబ్యూటర్లు. ఏదైనా పెద్ద హీరో సినిమా అంటే ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కు వస్తారని వారు అభిప్రాయపడుతున్నారు. కాని కోలీవుడ్ లో ప్రస్తుతం ఏ పెద్ద హీరో సినిమాలు రిలీజ్ కు రెడీగా లేవు. అందుకే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ తమిళ్ వెర్షన్ ‘ఇవనుక్కు సరియాన ఆళిల్లై’ ను రిలీజ్ చేయాలని వారు డిసైడ్ అయ్యారు.
ఈ వార్తను తమిళ్ డిస్టిబ్యూటర్లు కన్ఫర్మ్ చేశారు కూడా. అన్నీ అనుకున్నట్టే జరిగితే తమిళనాడులో దీపావళికి మహేష్ బాబు తన సినిమా ద్వారా థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా రష్మిక హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా కోలీవుడ్ లో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.