ఈ ఏడాది మలయాళంలో బిజు మీనన్, పృధ్విరాజ్ హీరోలుగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ లో కీలకమైన పోలీస్ పాత్ర పోషించిన అనిల్ నెడుమాంగాడ్ అనే నటుడు నేటి సాయంత్రం ఆరుగంటలకు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. కేరళలోని తొడుపుళ అనే గ్రామంలోని మలంకర డ్యామ్ లో స్నేహితులతో స్నానం చేయడానికి దిగిన అనిల్ .. ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించారు. పిజ్జా అనే సినిమా షూటింగ్ గ్యాప్ లో డ్యామ్ లోకి దిగిన ఆయన ప్రవాహ వేగానికి వాగులో మునిగిపోయి తుదిశ్వాస విడిచారు.
పలు మలయాళ టీవీ ఛానల్స్ లో న్యూస్ ప్రెజెంటర్ గా పనిచేసిన అనిల్ నెడుమాంగాడ్ చాలా తక్కువ సమయంలోనే మలయాళ సినిమాల్లో ముఖ్యపాత్రలు చేసే స్థాయికి ఎదిగారు. ‘కమ్మట్టి పాడం, పొరింజు మరియమ్ జోస్, న్యాన్ స్టీవ్ లోపేజ్, పావాడ, పాపం చేయ్యాత్తవర్ కల్లెరియట్టే , అయ్యప్పనుమ్ కోషియుమ్’ లాంటి సినిమాలతో మాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘కమ్మట్టి పాడం, అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాల్లో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనిల్ మరణ వార్త వినగానే మలయాళ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.