రాజా రాణి అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ బ్యూటీ నజ్రియా.క్యూట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తన అనే ఒక ఐటి ఉద్యోగిగా నటించిన నజ్రియా తన నటనతో తమిళ, తెలుగు భాషల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మలయాళం టివి చానెల్ ఏషియా నెట్ లో వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన నజ్రియా.. ,2006లో బాల నటిగా వెండితెర తెరంగేట్రం చేసిన ఆమె, 2013లో హీరోయిన్ గా మారారు.మలయాళం , తమిళం భాషలలొ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అందరి మన్ననలు పొందారు. 2014లో నేరం సినిమాకు గాను విజయ్ అవార్డ్స్ ఆమెకు ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం ఇచ్చారు. దీనితో పాటు ఆ సినిమాలోని నటనకు ఆమె మరికొన్ని ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. 45వ కేరళ రాష్ట్ర ఫిలిం పురస్కారాలలో ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకున్నారు నజ్రియా.
సినీ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే నజ్రియా పెళ్ళి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. 2014లో మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ తో వివాహం కుదిరినట్టు మీడియాకు వెల్లడించారు నజ్రియా అదే సంవత్సరం తిరువనంతపురంలో ఆయనను పెళ్లాడారు. అంజలీ మీనన్ దర్శకత్వం వహించిన బెంగళూర్ డేస్ సినిమా షూటింగ్ సమయంలో నజ్రియా , ఫహద్ ఫాసిల్ కు పరిచయం ఏర్పడింది.ఈ సినిమాలో వీరిద్దరూ భార్యా, భర్తలుగా నటించారు.. వీరి పెళ్ళి విషయంలో ఇరువురి తల్లిదండ్రులదే కీలకమైన పాత్ర అని వెల్లడించారు కూడా.
పెళ్ళి తర్వాత చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న నజ్రియా, తాజాగా తెలుగు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన “అంటే.. సుందరానికీ” మూవీలో కథానాయికగా ఈమె నటించారు.హీరోయిన్ గా నజ్రియా కి ఇదే తొలి డైరెక్ట్ తెలుగు సినిమా కావడం విశేషం.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నజ్రియా చేసిన పలు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “టాలీవుడ్ తనకు బాగా నచ్చిందని.. ఇక్కడి వాతావరణానికి తాను చాలా ఫాస్టుగా అలవాటు పడిపోయానని ఆమె తెలిపారు. నాని సినిమాలో తప్పకుండా కొత్తదనం ఉంటుందన్న ఆమె.. నాని సినిమా ఒప్పుకున్నాడు అంటే ఖచ్చితంగా ఆ కథలో విషయం ఉంటుందని తాను భావిస్తానని.. అందువల్లనే ఈ సినిమాకి ఓకే చెప్పడానికి తాను పెద్దగా సమయం తీసుకోలేదు అన్నారు.
అదేసమయంలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను తాను తప్పకుండా చూస్తుంటానని.. ఎవరి స్టైల్ వారిదని.. అందరితోను కలిసి నటించాలని ఉందని ఆమె తెలిపారు.టాలీవుడ్ లో ముఖ్యంగా ఎన్టీఆర్.. మహేశ్ బాబు .. రాంచరణ్ లతో తనకు నటించాలని ఉందని ఆమె తన మనసులో మాట బయట పెట్టేశారు.ఇక కోలీవుడ్ లో ఎవరితో చేయాలని ఉందని అడిగితే మాత్రం తాను చెప్పే పేరు అజిత్” అంటూ నజ్రియా సమాధానమిచ్చింది.
నాని మూవీతో రీఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీకి అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.