సినిమాల మాటేమోగాని సామాజిక పరమైన అంశాల్లో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ స్పందించే తీరు ముచ్చటగొలుపుతోంది. మనోజ్ లో సామాజిక స్పృహ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ లలో ఈ యువ హీరో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అది కుక్క అయినా, మనషి అయినా ఆయన స్పందించే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే మంచు మనోజ్ త్వరలో మంచి మనోజ్ అనిపించుకుంటాడేమో. మొన్న సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పుడు అపోలో అస్పత్రికి వెళ్లి బయటికి వస్తూ మీడియాతో మాట్లాడారు.
అలాంటి యాక్సిడెంట్ జరగడం దురదృష్టకరమనడంతో పాటు యాక్సిడెంట్ తర్వాత రోడ్డు బాగుచేసినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సమస్యను అతను చూసే తీరు భిన్నంగా ఉంటోంది. ఇంకొకరికి ఇలా జరగకుండా అధికారులు వెంటనే స్పందించడం బాగుందని ప్రశంసించారు. అతనిలో ఇదొక కోణం. సైదాబాద్ బాలిక హత్యాచారం ఘటన విషయంలోనూ మనోజ్ స్పందించిన తీరుకు నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. సైదాబాద్ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాపై ఫైర్ అయ్యారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలైన సాయిధరమ్ తేజ్ తప్పితే సైదాబాద్ పాప గురించి మీడియాకు ఎందుకు పట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పసిపాపపై అకృత్యం జరిగితే ఆ పాప తల్లిదండ్రులతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ తల్లి కాళ్లమీద పడి ఏడుస్తుంటే నిస్సహాయంగా అనిపించింది. నేను చేతకాని వాడిని అనిపించింది. ఇలాంటి వ్యవస్థను క్రియేట్ చేసినందుకు మనమే బాధ్యత తీసుకోవాలి. ఆడపిల్లలనూ, మహిళలనూ ఎలా గౌరవించాలో పిల్లలకు నేర్పించాలి.
ఇలాంటి కేసుల్లో దోషులకు 24 గంటల వ్యవధిలోనే శిక్ష పడాలి’ అని కామెంట్ చేశారు. అంతటితో ఆగలేదు. నిందితుడి ఫోటోలను రకరకాలుగా మార్చి తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. నిందితుడు మారు వేషాల్లో తిరిగే ప్రమాదం ఉన్నందున ఏ వేషంలో ఎలా ఉంటాడో తెలియజెప్పేందుకు జుత్తు, గడ్డం వంటి వాటిల్లో మార్పులు చేసి పోస్టు చేశారు. ఆ తర్వాత నిందితుడు రాజు రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు.
ఇక్కడ కూడా మనోజ్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ‘ఆ రాక్షసుడికి ఇలా జరగాల్సిందే. ఇలాంటి పనులు చేసే ఎవరికైనా అదే జరగాలి. ఆ చిన్నారి ఎక్కడ ఉన్నా ఆమె ఆత్మ శాంతిస్తుందని ఆ ఈశ్వరుడిని కోరుకుంటున్నా’ అన్నారు. మంచు మనోజ్ ఇలా తనదైన రీతిలో స్పందించడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంటి పేరులో మంచు ఉన్నట్లుగానే ఆయన హృదయంలోనూ అలాంటి చల్లదనం ఉన్నట్టుంది. అందుకే మంచి మనోజ్ గా కితాబులు అతనికి దక్కుతున్నాయి.
Must read ;- షాకింగ్.. మంచు బ్రదర్స్ మధ్య గొడవలా..?