ఆళ్ళ సాధించిన లిమ్కా రికార్డు ఘనత ఆ బుద్ధుడికే తెలియాలి
ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే రికార్డ్స్ ని ఎలాగైతే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరుస్తారో అలానే ఇండియాలో నమోదయ్యే రికార్డ్స్ ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరుస్తారు. అటువంటి ఈ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు జాబితాలోకి తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చేరారు. ఎంతో కృషి, పట్టుదల ఉంటే కానీ ఇది సాధ్యం అన్నది తెలిసిందే! ఆర్కే మాత్రం ఈ అరుదైన గౌరవాన్ని రెండోసారి ఎమ్మెల్యే అయిన మూడేళ్ళలోనే సాధించారు. అనేక విభాగాల్లో రికార్డ్స్ ను నమోదు చేసే లిమ్కా బుక్ మంగళగిరి ఎమ్మెల్యేను సాధించిన రికార్డ్స్ ను మాత్రం వింతల విభాగంలో చేర్చి, ప్రకటించారు. ఇప్పుడు ఇదే అంశం దేశ వ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యే సాధించిన ఈ వింత రికార్డు ఏంటా అని గూగుల్ వెతికి.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు!
4 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు 400 రోజులు..!
గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలో గౌతం బుద్ధ రోడ్డు విస్తరణ పనులు గురించి ప్రస్తుతం ఏపి వ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. నత్తకు నడక నేర్పే విధంగా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్థిని చూసి.. ప్రజలే కాదు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆర్ అండ్ బీ బంగ్లా నుంచి ఎన్ఆర్ఐ వరకూ దాదాపు 4 కిలోమీటర్ల రోడ్డును డివైడర్ కు ఎమ్మెల్యే ఆళ్ళ శంఖు స్థాపన చేశారు. ఒక పక్క 52 అడుగులు మరోపక్క 52 అడుగులు విస్తరణలో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు పనులు పూర్తి చెయ్యడానికి కేవలం 3 నెలలు చాలు. ఇండియన్ రోడ్డ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం అయితే ఈ పనులు కేవలం మూడంటే మూడే నెలల్లో పూర్తి అవ్వాలి. కానీ మంగళగిరి ఎమ్మెల్యే మూడు ఏళ్ళు అయినా ఆ పనులు ఓ కొలిక్కి రాలేదు. 4 కిలోమీటర్ల రోడ్డుని అభివృద్ధి చెయ్యడానికి సుమారుగా మూడేళ్లు తీసుకోవడం దేశంలోనే అరుదైన రికార్డుగా లిమ్కా బుక్ ఆఫ్ వారు గుర్తించారు. ఈ వింత ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా ఆర్కే పేరుని లిమ్కా బుక్ లో చేర్చి.. ఆశ్చర్యం వ్యక్తం చేసింది! కరోనా సాకు చూపి మూడేళ్లుగా ఒకే రోడ్డు పని చెయ్యడం, సుమారుగా 400 సార్లు పని పర్యవేక్షణ చేస్తున్నట్టు ఫోటోలు దిగడం, సుమారుగా ఆ రోడ్డు పనులకు సంబందించిన 800 వార్తలు వివిధ పేపర్ల లో రావడం, మూడు కరోనా వేవ్ లు పూర్తవుతున్నా గౌతమ బుద్ధా రోడ్డు పూర్తి కాకపోవడం లాంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకునే గౌతమ బుద్ధా రోడ్డు వింతని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించినట్టు సమాచారం. ఏప్రిల్ 1 న ఈ అరుదైన రికార్డ్ ని గుర్తిస్తూ ఇచ్చే అవార్డును మంగళగిరి గౌతం బుద్ధా రోడ్డు దగ్గర ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఎమ్మెల్యే ఆర్కేకి అందించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మూడేళ్ళ పాటు ప్రజలు నరక యాతన అనుభవించేలా చేసిన మా నేత ఆర్కే.. ఇటువంటి అరుదైన రికార్డ్ సాధించినందుకు ఆనందంగా ఉందని ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు!











