సాగర్ ఉప ఎన్నిక తరువాతే టీపీసీసీ ఉంటుందని, సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ శ్రేణులన్నీ కలసి పనిచేస్తాయని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసే వరకూ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు కొనసాగనున్నట్లు తెలిపారు. సాగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం పార్టీ శ్రేణులన్నీ సమష్టిగా పనిచేస్తాయని, సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు అత్యంత ప్రాధాన్య అంశమని, కాంగ్రెస్ పునరుజ్జీవానికి సాగర్ ఉప ఎన్నిక విజయం దోహదం చేస్తుందని ఠాకూర్ అభిప్రాయపడ్డారు. అంతవరకు బాగానే ఉంది.
తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా.. వరుస ఓటములు ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత రెండు ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఈ మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అంతా కలుస్తాం.. విజయం సాధిస్తాం.. అనే నినాదం వినిపించింది. చివరికి ఆ పార్టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా చేసిన చోట అంటే సిట్టింగ్ స్థానంలో.. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డిని పోటీకి దింపినా.. 40వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్తి శానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. తరువాత దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీలో కొందరు నాయకుల వ్యవహార శైలి మరీ దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విజయం కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం అని మాణికం ఠాకూర్ చెప్పడం అంటే.. ప్రస్తుతం ఆ పార్టీ పూర్తిగా చతికిలిపడిపోయిందని అంగీకరించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అలా చతికిలపడిపోవడానికి.. కారణం.. కేడర్ లేకపోవడమా.. నాయకుల మధ్య దొంగదెబ్బల వ్యవహారమా అనే ప్రశ్న చాన్నాళ్లుగా తలెత్తుతోంది. కేడర్ ఉన్నా.. కొందరు నాయకుల వ్యవహార శైలి వల్ల ఈ పరిస్థితి వచ్చిందనే వాదన బలంగా ఉంది.
ఇక దుబ్బాక విషయానికి వస్తే.. చివరి నిమిషంలో టీఆర్ఎస్ నుంచి (గతంలో టీడీపీ, కాంగ్రెస్) వచ్చిన చెరకు ముత్యం రెడ్డి కుమారుడు చెరకు శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రచారంలో కొందరు నాయకులు తప్ప.. పెద్దగా పర్యటించలేదు. ఒకరకంగా చెప్పాలంటే.. ఒకరిద్దరు తప్ప..మిగతా పెద్ద నాయకులు అన్ని విధాలుగా హ్యాండ్ ఇచ్చారన్న ప్రచారం ఉంది. ఆర్థిక విషయాల్లోనూ ఇదే జరిగిందని చెబుతున్నారు. దుబ్బాకలో అభ్యర్థిత్వం పై చాలా చర్చ జరిగినందున సమయం లేదు కాబట్టి తాము గెలవలేకపోయామని, జీహెచ్ఎంసీలో తాము ఏంటో చూపిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. పూర్తిగా చతికిలపడింది. అయితే ఈ వైఫల్యంపై నాయకులు పెద్దగా నోరుమెదపలేదు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య గేమ్ నడిచిందని, మతపరమైన అంశాలూ తెరపైకి వచ్చాయని, అందుకే తమకు ఓటు వేయలేదని కొందరు సమర్థించుకున్నారు. అసలు ఎంతమంది నాయకులు నిజమైన ప్రచారం చేశారు.. ఎంత మంది నాయకులు మొక్కుబడిగా ప్రచారం చేశారనే పోస్టుమార్టం మాత్రం కనిపించలేదనే విమర్శలున్నాయి.
అసలు విషయం వదిలేసి..
ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి అభ్యర్థి అని వినిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం జానారెడ్డి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా.. ఆయన ఆ ప్రచారాన్ని ఖండించారు. ఆయన కుమారుడు రఘువీర్ కూడా అభ్యర్థిత్వం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. జానారెడ్డికి ఉన్న ఫాలోయింగ్, కరడుగట్టిన కాంగ్రెస్ వాదుల సపోర్టు తప్ప.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై పెద్ద సానుకూలత లేదని చెప్పాల్సి ఉంటుంది. కారణం ఒక్కటే.. కాంగ్రెస్ పార్టీలో గెలిచినా.. చాలా మంది టీఆర్ఎస్ లోకి వెళ్లడంతో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతకు భీటలు వచ్చాయని చెప్పవచ్చు. ఇక టీపీసీసీ విషయంలో నాయకులు బహిరంగంగానే ఎంత రచ్చ జరిగిందనేది కూడా అందరికీ తెలిసిన అంశమే. ఈ నేపథ్యంలో ఇంకా పాత నినాదమే కాంగ్రెస్ పార్టీ ఎత్తుకోవడంపై విమర్శలు వచ్చేశాయి.
ఒక్క పీసీసీ మార్చితే సరిపోతుందా…
వాస్తవానికి పీసీసీ ఒక్కటి మార్చినంత మాత్రాన.. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందా, ఏక కాలంలో టీఆర్ఎస్ ని, బీజేపీని ఢీ కొడుతుందా.. అంటే.. కచ్చితమైన సమాధానం రాకపోవచ్చు. కాని నిస్తేజంలో ఉన్న పార్టీ కేడర్ లో ఉత్తేజం వస్తుంది. అదే సమయంలో తటస్థ ఓటరును ఆకర్షించడానికి, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలను కాదని తమకే ఎందుకు ఓటు వేయాలో చెప్పే విధంగా తెలంగాణ కాంగ్రెస్‌కు సరైన ఆయుధం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్తే సరిపోదని, సాగర్ ఉప ఎన్నికల్లో ప్రచార అంశాలను బట్టే.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నినాదాలు ఉంటాయన్న చర్చ జరుగుతున్న ఈ టైంలో కేవలం కాంగ్రెస్ శ్రేణులన్నీ ఏకతాటిపైకి వస్తాయని, గెలుస్తామని చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, నాయకుల అభిప్రాయాలు వెల్లడిపై స్వేచ్ఛ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అది నిజమే కావచ్చు.. కాని ప్రజాల్లో విశ్వాసం కలిగించేలా.. కేడర్‌లో ఉత్తేజం కలిగించేలా తీసుకునే చర్యలు మాత్రం కరవయ్యాయి. ఇక రానున్న కాలంలో.. సాగర్ ఉప ఎన్నికల విషయంలో నాయకులంతా కలసి వస్తారా.. గెలుస్తారా.. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభం వస్తుందా అనేది ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలపై ఆధార పడి ఉంటుంది.