తుపాకీ ద్వారా సమసమాజ స్థాపన జరుగుతుందనే ఉద్దేశంతో విద్యావేత్తలు, ఉత్సాహవంతులు, వెనుకబాటు తనానికి గురైన వారు నక్సలిజం వైపు అడుగులు వేశారు. ‘చారు మజుందార్’ నేతృత్వంలో దేశంలోనే గాక ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో మావోయిస్టు కార్యకలాపాలు ఉధృతంగా సాగాయి. నమ్మిన సిద్ధాంతాల కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. కొండపల్లి సీతారామయ్య, మల్లోజుల కోటేశ్వరరావు, అక్కిరాజు హరగోపాల్, ముప్పాళ్ల లక్ష్మణరావు, ఆజాద్ లాంటి అగ్రనేతలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లినవారే. సమాజంలో మార్పు కోసం తుపాకీ పట్టిన నేతలు పలు కారణాలతో ఉద్యమాల బాటను వీడుతున్నారు. ఈ నేపథ్యంలో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీ మారుతున్నట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
గణపతి లొంగుబాటుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. గణపతి లొంగుబాటు వార్తలతో రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారు. తాజాగా మావోయిస్టు మరో అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి కూడా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. భూపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడుగా పని చేస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కూడా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు (కిషన్ జీ)కు భూపతి స్వయానా తమ్ముడే. ఆజాద్ ఎన్ కౌంటర్ తరువాత భూపతి కేంద్ర కమిటీ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. దంతెవాడలో జరుగుతున్న వరుస కార్యకలాపాలు భూపతి నేతృత్వంలోనే జరుగుతున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలలో భూపతిపై పలు కేసులు నమోదు కావడమే గాక తలపై రివార్డ్ కూడా ఉన్నాయి. వెనుక బడిన కులాల కోసం భూపతి ఎన్నో రచనలు చేశారు. జన స్రవంతిలో కలిసే నాయకులను స్వాగతిస్తామని అధికారులు తెలియచేస్తున్నారు. ఇప్పటికే తమ ఉనికిని కోల్పోయిన మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు కూడా దూరం కావడంతో మరింత బలహీనం కానుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.