మార్వెల్ ప్రపంచంలోకి ఒకసారి అడుగుపెడితే మనల్ని మనమై మైమరచిపోతాం. ఈ సిరీస్ లో అందరూ సూపర్ హీరోలు, సూపర్ విలన్లే. ఏ సినిమాకు ఆ సినిమాయే ఓ ప్రత్యేకత మళ్లీ పాత సినిమాలతో లింకులు.. ఇదే మార్వెల్ శైలి. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ముగిసిపోయిందనుకుంటే తప్పులో కాలేసినట్టే. వాండావిజన్ గా మళ్లీ మీ ముందుకు వచ్చేస్తోంది. మార్వెల్ కామిక్ సిరీస్ లో కీలకమైన మూడు పాత్రలతో రూపొందిస్తున్న సిరీస్ వాండావిజన్. వాండా మాగ్జిమాఫ్, స్కార్లెట్ విచ్, విజన్ లతో అల్లుతున్న వెబ్ సిరీస్ ఇది. జాక్ షాఫెర్ దీనికి ప్రధాన రచయిత. మాట్ షక్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎలిజబెత్ ఒల్సేన్, పాల్ బెట్టనీ తమ పాత్రలను వండా మాగ్జిమోఫ్ / స్కార్లెట్ విచ్, విజన్ గా చిత్ర సిరీస్ నుంచి రిపీట్ చేస్తారన్నమాట. టెయోనా పారిస్, కాట్ డెన్నింగ్స్, రాండాల్ పార్క్, కాథరిన్ హాన్ కూడా నటించారు.
డిసెంబరు నుంచే స్ట్రీమింగ్..
డిస్నీ ప్లస్ కోసం ప్రత్యేకంగా రాబోతున్న అమెరికన్ వెబ్ టెలివిజన్ మినిసిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే ‘ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్’కు ఇది కొనసాగింపు అనుకోవాల్సి ఉంటుందేమో. ఈ వెబ్ సిరీస్ లోని సంఘటనలన్నీ ఎండ్ గేమ్ తర్వాతే ఉంటాయట. 2019 లో జార్జియాలోని అట్లాంటాలో షూటింగ్ ప్రారంభించారు. 2020 మార్చిలో కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లోనే షూటింగ్ కొనసాగిస్తున్నారు. డిసెంబరు నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రసారాలు ఉంటాయి. ఈ రోజు దీని ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అలాగే ట్రైలర్ ను కూడా వదిలారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ఉంటుుంది.
డిస్నీ ప్లస్ తో ప్రత్యేక ఒప్పందం
మార్వెల్ సంస్థ ఇక నెట్ ఫ్లిక్స్ కు చెల్లు చీటీ పాడినట్లే. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీప్లస్ తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై వీరిద్దరూ కలిసి కొనసాగనున్నారు. అధికారిక స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ గా డిస్నీ ప్లస్ ను వీరు ఎంచుకున్నారు. మార్వెల్ సంస్థ వెబ్ సిరీస్ ల మీద ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అందులో తొలి వెబ్ సిరీస్ వాండా విజన్. మాస్ మసాలా అంశాలన్నీ ఈ వెబ్ సిరీస్ లో ఉంటాయట. మార్వెల్ లోని ఓ కొత్త డైమన్షన్ ఆవిష్కారమవుతోందని వారు అంటున్నారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన దీని ట్రైలర్ లో అద్భుతమైన అంశాలెన్నో ఉన్నాయి. అద్భుత శక్తులున్న ఓ దంపతుల చుట్టూనే కథ తిరుగుతుంది.
ఈ కథ ప్రత్యేకత ఏమిటంటే..
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోనే రూపొందిన రెండు పాత్రలే ఇందులో కీలకం. ‘ఎవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ’లో వాండా విలన్లలో ఒకడు. ఈ సినిమా చివరలో అతను సూపర్ హీరోస్ గ్రూపులో భాగమవుతాడు. విజన్ తో అతని జర్నీ కొనసాగుతుంది. కానీ విజన్ థానోస్ చేతిలో ‘ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ ’ చివరిలో మరణిస్తాడు. అప్పుడు వాండా, విజన్లతో ఒక వెబ్ సిరీస్ ను రూపొందించడం ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
థానోస్ మరణం తర్వాత విజన్ తిరిగి జీవితంలోకి రాలేదు కాబట్టి ఇది ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న చాలామందిలో ఉంది. ఈ పాత్రను ఎలా పుట్టిస్తారన్నది మాత్రం సస్పన్సే. అదెలా సాధ్యమైందో ఈ సిరీస్ చూస్తేనేగానీ అర్థంకాదు. వచ్చే ఏడాది మార్వెల్ నుంచి వచ్చే ఏడాది తెరపైకి రాబోతున్న హారర్ చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’కూ దీనికీ ఏమైనా సంబంధం ఉంటుందా అన్నది కూడా చూడాల్సిందే.