కథ కంచికి మనం ఇంటికి అనేది మనం చిన్నప్పటి నుంచి మనం వింటున్న మాట. కానీ వాస్తవానికి ఏ కథలూ కంచికి చేరడంలేదు. తిరిగి మొదలవుతున్నాయి. ‘ఎవెంజర్స్ : ఎండ్ గేమ్ తో మార్వెల్ ప్రయాణం ముగిసిపోయినట్టే అనుకుంటే పొరపాటే. మార్వెల్ సంస్థ సీక్వెల్ జపాన్ని ఇంకా మానలేదు. కరోనా రాకుండా ఉండి ఉంటే ఈ పాటికే బ్లాక్ పాంథర్ 2 సెట్స్ మీదకు వెళ్లిపోయి ఉండేది. మార్వెల్ సిరీస్ లో బ్లాక్ పాంథర్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీనికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దీని సీక్వెల్ ను మార్వెల్ ఎప్పుడో ప్రకటించింది.
కాకపోతే పరిస్థితులు అనుకూలించలేదు. ఆ తర్వాత బ్లాక్ పాంథర్ హీరో బోస్మాన్ ఆకస్మిక మరణం సంభవించింది. లేకుంటే ఈ 2021లోనే ఈ సీక్వెల్ ప్రారంభమై ఉండేది. క్యాన్సర్ కారణంగా బోస్మాన్ మరణించాడు. తాజా సమాచారం ఏమిటంటే వచ్చే ఏడాది జులైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. నిర్మాత ర్యాన్ కూగ్లర్ అధికారికంగానే ఈ విషయాన్ని ప్రకటించారు. జులైలో ఆట్లాంటాలో షూటింగ్ ప్రారంభిస్తారు.
ఆరు నెలల పాటు షూటింగ్ కొనసాగుతుంది. మరి బోస్మాన్ నటించిన పాత్రను ఎవరు పోషిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది. దీనిపై మార్వెల్ ఇంకా స్పష్టతను ఇవ్వలేదు. మెక్సికన్ నటుడు టెనోచ్ హుయెర్డా ఇందులో ఓ పాత్ర పోషిస్తున్నాడు. బహుశా అతనే బ్లాక్ పాంథర్ కావచ్చునేమో చెప్పలేం. లెటిటియా రైట్, లుపిటా న్యోంగో, విన్స్టన్ డ్యూక్, ఏంజెలా బాసెట్ లు కూడా ఇందులో నటించే అవకాశం ఉంది.
ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభమైతే విడుదల 2022లోనే అవుతుంది. అంటే మార్వెల్ సిరీస్ మనకు రెండేళ్ల పాటు లేనట్లే. ఓటీటీలో మాత్రం డిస్నీప్లస్ హాట్ స్టార్ ద్వారా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తన అభిమానులను దూరం చేసుకోకుండా మార్వెల్ కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. వారి వ్యాపార సామ్రాజ్యానికి ఈ సిరీస్ అతి పెద్ద పెట్టుబడి. కాబట్టి బ్లాక్ పాంథర్ 2 కోసం మరికొంత కాలం మనం వెయిట్ చేయక తప్పదు.
Must Read ;- థియేటర్స్ రీఓపెనింగ్ రోజునే.. ఓటీటీలో విడుదలవుతోన్న మలయాళ సినిమా