‘అల’ వచ్చినప్పుడే ‘తల’ వంచుకుని వెళ్లాలి’ అనే సామెతను రవితేజ చక్కగా ఆచరణలో పెడుతూ వచ్చాడు. వరుస పరాజయాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆయన పారితోషికం స్థాయి పడిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇక రవితేజ పనైపోయిందనే ప్రచారం జరిగింది. కానీ రవితేజ ఆ మాటలేం పట్టించుకోలేదు. ఎంతటివారైనా కాలానికి కట్టుబడవలసిందే .. పరిస్థితులకు పట్టుబడవలసిందే. అలా సహనంతో వెయిట్ చేస్తూ వచ్చిన రవితేజ, ‘క్రాక్‘ సినిమాతో ఈ ఏడాదికి శుభారంభం పలికాడు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘క్రాక్’ .. రవితేజ కెరియర్లోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. లాక్ డౌన్ తరువాత థియేటర్లను కళకళలాడించిన సినిమాగా నిలిచింది. చాలాకాలం తరువాత మాస్ మహారాజ్ అనే తన బిరుదుకు తగిన సినిమా చేశాడని రవితేజను గురించి అంతా చెప్పుకున్నారు. ఆ తరువాత సినిమాగా ఆయన ‘ఖిలాడి’ చేస్తున్నాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కామెడీతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో నాయికలుగా డింపుల్ హయతి .. మీనాక్షి చౌదరి మెరవనున్నారు.
ఈ సినిమా తరువాత రవితేజ – పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకూ రాలేదు. కానీ ‘ఖిలాడి’ తరువాత రవితేజ ఒక కొత్త దర్శకుడితో సినిమా చేసే అవకాశాలు బలంగా ఉన్నాయని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఆ యువకుడు ఎవరో కాదు .. ‘క్రాక్’ సినిమాకి అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన ‘గులాబీ శ్రీను’. ఆయన రవితేజకి ఒక కథను వినిపించడం .. రవితేజ సుముఖతను వ్యక్తం చేయడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ కథ కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే సాగుతుందని చెబుతున్నారు. మొత్తానికి రవితేజ మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడన్న మాట.











