ఒక దర్శకుడి మీద ట్రోల్స్ ఈ స్థాయిలో ఉంటాయా? ఈ ఘనత ఒక్క సానా బుచ్చిబాబుకే దక్కిందనుకోవాలి. ఎందుకంటే ‘ఉప్పెన’ సినిమా విడుదలైంది మొదలు ట్రోల్స్ ఎక్కువయ్యాయి. మెగా ఫ్యామిలీని కోసేశాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు ఇలాంటి హిట్ ఇచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా సానా బుచ్చిబాబును అభినందించారు. పైగా ఓ మెగా హీరో తొలి సినిమాకే ఇంత వసూళ్లు సాధించడం కూడా పెద్ద రికార్డుగా మారింది. సినిమా విడుదలైన తొలి రోజున వసూళ్లే రూ. 10.42 కోట్లు లెక్క తేలాయి. టాలీవుడ్ లో ఇది కొత్త రికార్డుగానే చెప్పాలి. సినిమా రేటింగులను మించి వసూళ్లు ఉన్నాయి.

అది హీరో వల్ల వచ్చినా క్రేజా, హీరోయిన్ వల్ల వచ్చిన క్రేజా, దర్శకుడి ప్రతిభా పాటవాల వల్ల వచ్చిన క్రేజా లాంటి విషయాలను పక్కన పెడితే దర్శకుడు ఇంతలా ఏం చేశాడో సినిమా చూసిన వారికే తెలుసు. అసలు ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతినే ఎందుకు తీసుకోవాలి అనే మాటలు కూడా వినిపించాయి. ఈ తరహా విలన్ గా ఎవరైనా చేయవచ్చు కదా అన్నవారూ ఉన్నారు. అలాగే హీరోగా వైష్ణవ్ తేజ్ కు బదులు కొత్త హీరోను పెట్టి సినిమా చేయవచ్చన్న మాట కూడా వినిపించింది. పరువు హత్యల నేపథ్యంలో సాగే కథలు చాలా వరకు ఇలాంటి కొత్తవారితో తీసినవే. ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి హీరోయిన్ ఒక కారణమైతే, దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఇంకో కారణం.
కాకపోతే మార్కెట్ విస్తరించుకోవడానికి విజయ్ సేతుపతిని ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. పైగా ఆ పాత్రను ఇంకొకరితో చేయించినా ఇంత హైప్ ఈ సినిమాకి వచ్చి ఉండేది కాదేమో. వైష్ణవ్ అన్నయ్య సాయిధరమ్ తేజ్ తొలి సినిమా ఫాప్ అనుభవాన్ని ఇస్తే, ఈ తమ్ముడి సినిమా మాత్రం హిట్ ఖాతాలోకి వెళ్లిపోయింది. అసలు ఇలాంటి పాత్రను వైష్ణవ్ ఎందుకు ఎంచుకున్నాడన్న విమర్శలు మొదటిరోజు వచ్చాయి. సినిమా ఇచ్చిన ఫలితం చూశాక ఆ విమర్శలన్నీ గాలికి ఎగిరిపోయాయి. ఫలితం మాట ఎలా ఉన్నా ‘మెగా’ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.
Must Read ;- వైష్ణవ్ తేజ మా ఫ్యామిలీకే గర్వకారణం : మెగాస్టార్ చిరంజీవి











