మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 13న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రీకరణను మరింత స్పీడప్ చేశాడు దర్శకుడు. ఇక దీని తర్వాత చిరు ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తెలుగు వెర్షన్ ను చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా.. మన నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దాడట దర్శకుడు. ఈ క్రమంలో మెగాస్టార్ పాత్ర మరీ సీరియస్ గా కాకుండా.. కాస్తంత జోవియల్ గానూ ఉండేలా మార్చారట.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం ఓ టైటిల్ ను ఖాయం చేసినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ‘లూసిఫర్’ కథాంశం ప్రకారం ఇది పొలిటికల్ థ్రిల్లరే అయినా.. హీరో పాత్ర కు రాజకీయాలకు అసలేమాత్రం సంబంధం ఉండదు. ఒక విధంగా ఆయనది పొలిటికల్ కింగ్ మేకర్ అన్నమాట. అందుకే తెలుగు వెర్షన్ కు ‘రారాజు’ అనే టైటిల్ ఖాయం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అలాగే.. ‘కింగ్ మేకర్’ అనే టైటిల్ కూడా పరిశీలన లో ఉందని తెలుస్తోంది.
ఎయిటీస్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా.. జి.రామ్మోహనరావు దర్శకత్వంలో ‘రారాజు’ అనే సినిమా వచ్చింది. అందులో శారద ఆయన తల్లిగానూ, సుమన్ తమ్ముడిగానూ నటించారు. ఈ సినిమా అప్పట్లో యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు అదే టైటిల్ .. చిరంజీవి సినిమాకి ఖాయం చేయబోతుండడం విశేషం. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి రారాజుగా చిరంజీవి ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.
Must Read ;- ‘ఆచార్య’ ఫస్ట్ సింగిల్ : అదే గ్రేస్ తో వింటేజ్ మెగాస్టార్