శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్ వేడుక ఖమ్మంలో మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ఘనంగా జరిగింది. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన పాటలకు, ట్రైలర్స్ కి మంచి స్పందన వస్తోంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ మాట్లాడుతూ ‘శర్వానంద్ ఈ పాత్రను అద్భుతంగా పోషించాడు. హృదయం లోతుల్లోంచి వచ్చిన ఎమోషన్స్.. అందుకే అంత బాగా పండిందని అనుకుంటున్నాను.మేం సినిమా చూశాం.. బాగా వచ్చింది.. మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. రైతు కొడుకు రైతు అయ్యే రోజు రావాలి’ అన్నారు.
‘సరిగ్గా 12 ఏళ్ల క్రితం నాటి ప్రజా అంకిత యాత్ర పేరుతో ఖమ్మంలో ప్రచారం చేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. అప్పుడు ఇప్పుడూ అదే ప్రేమను చూపిస్తున్నారు. మీ అభిమానం చెక్కుచెదరలేదు. పోరాటాల ఖమ్మానికి, ఖమ్మం ప్రజలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు అనుకోకుండా దొరికిన అదృష్టం ఇది. చరణ్ ఫోన్ చేసి.. శర్వా సినిమా విడుదలవుతోంది.. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని అన్నాడు. ఎలా ఎలా నేను ఖమ్మంలో ఉన్నాను కదా? అని అన్నాను. వాళ్లే ఖమ్మంకు వస్తారు అని చెప్పాడు. ఖమ్మంలో అయితే జనాలు వస్తారా? అని అనుమానం ఉండేది. శ్రీకారం యూనిట్‌కు మాత్రం జనాలువస్తారు.. ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది.
మీరు ఇంత మంది వచ్చి ఆదరిస్తూ వారి నమ్మకాన్ని నిజం చేశారు.. ఎంతో మంచి కథ, వ్యవసాయం గొప్పదనం చెప్పే కథ..ఈ సినిమాలో సందేశమే కాదు.. అన్ని రకాల కమర్షియల్ హంగులున్నాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. హీరో హీరోయిన్లు, చిత్రయూనిట్ అందరికీ నా అభినందనలు ఈ ఈవెంట్‌కు రావడానికి నిర్మాతలు ముఖ్య కారణం అయితే.. శర్వానంద్ కూడా ఓ కారణం.. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే రామ్ చరణ్‌తో పెరిగాడు.. నాకు శర్వానంద్ బిడ్డలాంటివాడు.. మరో రామ్ చరణ్. అయితే నటన పట్ల మక్కువ ఉందో లేదో కూడా నాకు తెలీదు.. రామ్ చరణ్‌ను అడిగితే.. నాకు తెలీదు డాడీ అనేవాడు.
Must Read ;- ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ మూవీ మొదలుపెట్టనున్న శర్వానంద్
ఓ సారి థమ్సప్ యాడ్ గురించి యంగ్ బాయ్ నటించాల్సి వచ్చింది. ఎవరైతే బాగుంటుందా? అని అనుకునే సమయంలో.. శర్వానంద్ ఇంట్లో ఉన్నాడు.. నటిస్తావా? శర్వా అని అడిగితే.. అంకుల్ మీరు చెబితే చేస్తాను అన్నాడు.. ఆ మాట చాలు అని తీసుకెళ్లాను. అలా మేం ఇద్దరం వెళ్లి యాడ్‌లో నటించాం.. అదే మొదటి సారి కెమెరా ముందు కనిపించడం. ఏదీ కూడా ఎక్కువగా చెప్పడు. మాట్లాడడు. శర్వానంద్ చాలా సాత్వికుడు. అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఓ సాంగ్ సీన్లో కుర్రాడు కావాలి. ఎంతో అమాయకంగా కనిపించాలి. శర్వా అయితే బాగా చేస్తాడు అని అనుకున్నాను. నటిస్తావా? అని అంటే.. మీ సపోర్ట్ ఉంటే చేస్తాను అన్నాడు.
అలా గెస్ట్ క్యారెక్టర్ చేశాడు. అప్పుడే నాకు అర్థమైంది.. పెద్ద హీరో అవుతాడని.. ఆ సీన్ తన నటనకు ఓ మచ్చుతునక అని చెప్పవచ్చు. నాడే శర్వా నటనకు శ్రీకారం పడింది అక్కడే.. నటనకు తిలకం దిద్దింది కూడా నేనే. సినిమా సినిమాకు పరిణతి కనిపిస్తూ.. శ్రీకారం సినిమాతో మీ ముందుకురాబోతోన్నాడు.. సక్సెస్ కాబోతోందని సగర్వంగా చెబుతున్నాను..సమయం లేకపోవడంతో కొంత సినిమానే చూశాను. ఎంతో చక్కటి మెసెజ్.. కమర్షియల్ పంథాలో దర్శకుడు కిషోర్ అద్భుతంగా చెప్పారు. నేటి యువతరానికి వ్యవసాయ విలువ తెలిసేలా చూపించారు. తప్పకుండా ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.
తమ ఆతిథ్యం స్వీకరించినందుకు గాను మమత ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున చిరంజీవికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిరు సత్కారం చేశారు. అనంతరం తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ‘మనందరికి అన్నయ్య ఆచార్య మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా ఉన్న శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న శర్వానంద్, అరుళ్ మోహన్, దర్శక నిర్మాతలు, చిత్రయూనిట్‌కు నమస్సులు. ఈ ఈవెంట్‌కు ఇంత పెద్ద ఎత్తున జనం రావడానికి కారణం చిరంజీవి. మీరు ఖమ్మంలో ఒక్క షెడ్యూల్ అయినా చేయాలని కోరాను. ఆ కోరిక మేరకు కొరటాల శివ గారితో చెప్పించారు. కంటికి రెప్పలా చూసుకో అని కేటీయార్ గారు ఆదేశించారు.
చిన్నప్పటి నుంచి నేను మీ అభిమానిని. మార్నింగ్ షోకే వెళ్లి బ్రహ్మాండంగా డ్యాన్సులు, స్టెప్పులు వేసిన వాళ్లలో మేం ఉన్నాం. బావగారూ బాగున్నారా సినిమా డిస్ట్రీబ్యూషన్ కూడా చేశాం. మీరు కేంద్రమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి పని చేశారు. సినీ పరిశ్రమకు పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు.. బ్లడ్ అండ్ ఐ బ్యాంకుల ద్వారా ఎంతో మందికి సాయమందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి స్ఫూర్తిదాయకం. ఆచార్య సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ ‘ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. ఏ పాయింట్ మరిచి పోకూడదని రాసుకుని మరీ వచ్చాను. మొదటి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్.. నేను మొదట చూసిన విజయం. దీనికి శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. మా శ్రీకారానికి ఇలా గెస్ట్‌గా రావడం చాలా ఆనందంగా ఉంది.. శ్రీకారం సక్సెస్ అనేది ఆయన ఈ ఫంక్షన్‌కు రావడానికి ఒప్పుకున్నప్పుడే జరిగింది. ఆయన ఓ మాటన్నారు. శర్వా.. నీ సంకల్పం గొప్పదే.. దేవుడు నీ తలరాతను తిరిగి రాస్తాడు అని. ఆ మాటను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను.. ఆ సంకల్పమే నన్ను స్టార్‌ను చేసింది.. అందుకే ఇలా నిలబడ్డాను. ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి.. నేను గర్వంగా చెప్పుకునే పేరు.. నా మిత్రుడు రామ్ చరణ్..ట్రైలర్ చూశాకా ఫస్ట్ ఫోన్ కాల్ రామ్ చరణ్ నుంచి వచ్చింది.
ఈ సినిమా ఆడాలి.. ఆడుతుంది.. ఏ సాయం కావాలి చెప్పు చేస్తాను అన్నాడు. వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి శర్వా సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మనం సాయం చేయాలి అన్నాడు. వారసత్వం ద్వారా ప్రాపర్టీస్ వస్తాయి కానీ చిరంజీవి గారి క్యారెక్టర్ రామ్ చరణ్‌కు వచ్చింది.. ఇంకెవ్వరికీ దక్కదు. అది కేవలం నా ఫ్రెండ్ చరణ్‌కే సొంతం. థ్యాంక్యూ చరణ్.. నాకు సపోర్ట్ ఇచ్చినందుకు.. నా మంచి కోరుకునే చిరంజీవి, రామ్ చరణ్‌లకు నా సినిమాలు ఎప్పుడూ థ్యాంక్స్ చెబుతూనే ఉంటాయి. అన్నం పెట్టే భూమి, నవ్వించే నాన్న.. అందమైన అమ్మాయి.. వీటి చుట్టూ తిరిగే అబ్బాయి. అన్నీ ఈ సినిమాలో ఉంటాయి.. జై జవాన్.. జై కిసాన్.. జై హింద్’ అంటూ ముగించారు.
Must Read ;- ట్రైలర్ టాక్: వ్యవసాయ రంగంలో మేలుజాతి కుర్రోడి కథ ‘శ్రీకారం’