కారణం లేకుండా ఏ కార్యమూ జరగదంటారు. ఆ కారణకార్య సంబంధమే మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవిలను కలిపిందేమో. మెగాస్టార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు కాబట్టే నమ్మాల్సి వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వర రావు జాతీయ పురస్కార ప్రదాన కార్యక్రమానికి మెగాస్టార్ ముఖ్యఅతిథిగా హాజరైనప్పుడు ఆయన ఈ విషయాన్ని సభాముఖంగా ప్రకటించారు. అదేంటో చూద్దాం. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు, ఆయన భార్య అంజనాదేవిలకు కొత్త గా పెళ్లయిన రోజులవి.
సినిమాకి వెళ్లాలంటే పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లాల్సిందే. అప్పట్లో ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లే దిక్కు. అంజనాదేవికి ఏయన్నార్ అంటే విపరీతమైన అభిమానం. ఆ సమయంలో ‘రోజులు మారాయి’ సినిమా విడుదలైంది. ఏమైనా సరే ఆ సినిమాకి వెళ్లాలి. తన భర్తకు తన అభిమాన హీరో సినిమా చూడాలన్న కోరికను వ్యక్తం చేసిందామె. పైగా అప్పుడు అంజనాదేవి గర్భవతి కూడా. కాన్సు కూడా సమీపించింది. ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తే గాని టౌన్ రాదు. వద్దని వెంకట్రావు చెప్పినా అంజనాదేవి వినిపించుకోలేదు.
ఇక ఆమె కోరికను కాదనలేక ఓ జట్కా బండిని ఏర్పాటుచేశారు. వెళ్తుంటే దారిలో ఆ గుర్రపు బండి పక్కకి పడిపోయింది. భార్యాభర్తలిద్దరూ కిందపడిపోయారు. లోపల ఉన్న బిడ్డకు ఏమైందో ఏమోనని వెంకట్రావు తెగ కంగారు పడిపోయారు. వెనక్కి వెళ్లిపోదామంటే అంజనాదేవి వినిపించుకోవట్లేదు. సినిమాకు వెళ్లాల్సిందే అంటోంది. మొత్తానికి ‘రోజులుమారాయి’ సినిమా చూసి వచ్చారు.
ఈ రహస్యాన్ని చిరంజీవి అక్కినేని నాగేశ్వరరావు ముందే చెప్పారు. ఆ రోజు అమ్మ కడుపులో ఉన్న తనకు ఏమైనా జరిగి ఉంటే ఈరోజు ఇలా వచ్చేవాడినే కాదంటూ సెటైర్ విసిరారు. కాలక్రమేణా రోజులు మారాయి.. చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. ఆనాటి రోజులు మారాయి హీరో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ‘మెకానిక్ అల్లుడు’ సినిమా కూడా చేశారు. దీన్ని దైవలీల అనాలో ఇంకేం అనాలో. మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో కాలమే నిర్ణయిస్తుంది అనడానికి అద్దంపట్టే సంఘటన ఇది.
Must Read ;- అగ్రతారలు.. ‘మల్టీ’ మెరుపులు!