మెరిట్ అవసరం లేదు..పైరవీలే ప్రామాణికం. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు పంచుకు తిన్న తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్లుగా పుస్తకాలతో కుస్తీలు పడుతుంటే..అప్పటి అధికార వైసీపీ నేతలు అనర్హులకు సిఫార్సులతో ఉద్యోగాలు కట్టబెట్టారు. కడప నుంచి విశాఖ వరకు, జెడ్పీల నుంచి ఆర్టీసీ వరకు సాగిన ఈ అక్రమ నియామకాల బాగోతానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూపీ లాగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియతో గత పాలకుల చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. జిల్లా పరిషత్‌ల నుంచి పోలీసు శాఖలో హోంగార్డుల పోస్టుల వరకు సాగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. అర్హుల హక్కులను కాలరాసి, ఇష్టారాజ్యంగా నడిపిన ఈ నియామకాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఉద్యోగులు ఉండగా, నిబంధనల ప్రకారం APPSC లేదా రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా మాత్రమే భర్తీ జరగాలి. కానీ, గత పాలకులు ఈ రూల్స్‌ను పూర్తిగా గాలికొదిలేశారు. కడపలో 15, విశాఖలో 40కి పైగా అసాధారణ పోస్టింగ్‌లను తాజాగా గుర్తించారు. జగన్ పాదయాత్ర సమయంలో సపర్యలు చేసిన 50 మందికి, అధికారంలోకి రాగానే కడపలో అవసరం లేకపోయినా హోంగార్డులుగా ఉద్యోగాలు కట్టబెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లో ఫైర్ డిపార్ట్‌మెంట్‌లోనూ ఇదే తంతు కొనసాగింది.
కుటుంబ పోషకుడు మరణిస్తే కారుణ్య నియామకం కింద అర్హులకు దక్కాల్సిన ఉద్యోగాలను సైతం వైసీపీ నేతలు తమ స్వార్థానికి వాడుకున్నారు. 2023లో APSRTCలో నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 150 మందికి పైగా ఉద్యోగాలు కట్టబెట్టారు. జగన్ సమీప బంధువు సిఫారసు మేరకే ఈ పోస్టులు భర్తీ చేసినట్లు తేలింది. ఆ
గత ప్రభుత్వంలో హోంమంత్రిగా పని చేసిన తానేటి వనిత సిఫారసుతో జరిగిన మరో నియామకం అప్పట్లో సంచలనం సృష్టించింది. నెలకు లక్షన్నర జీతం తీసుకుంటున్న ఇంజనీరింగ్ భార్య, కారుణ్య నియామకానికి అనర్హురాలైనప్పటికీ తప్పుడు పత్రాలతో కొలువు దక్కించుకుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు క్రిమినల్ కేసు నమోదుకు సిఫారసు చేయగా, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి అక్రమాలన్నింటిపై చట్టపరమైన కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది.











