ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా డబుల్ ధమాకానే. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి మరో అడుగుపడింది. రెండు నగరాల్లో కలిపి తొలిదశలో రికార్డు స్థాయిలో రూ.21,616 కోట్ల వ్యయంతో 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండు ప్రాజెక్టుల డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను కేంద్రానికి పంపారు. కొన్ని అభ్యంతరాల పరిష్కారం తర్వాత, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆర్థిక మదింపు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులను జాయింట్ వెంచర్ మోడల్‌లో నిర్మించనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 20%, కేంద్ర ప్రభుత్వం 20% చొప్పున నిధులు సమకూరుస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను విదేశీ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరిస్తారు. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం వరకు టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెట్రో రైల్ కార్పొరేషన్‌కు అనుమతులు మంజూరు చేసింది.
పారిశ్రామిక, ఐటీ, పర్యాటక కేంద్రంగా ఎదుగుతున్న విశాఖలో తొలి దశ మెట్రో ప్రాజెక్టు 46.23 కిలోమీటర్ల మేర సాగనుంది. దీని అంచనా వ్యయం రూ.11,498 కోట్లు. ఇందులో స్టీల్‌ప్లాంట్-కొమ్మాది, గురుద్వారా-పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు కారిడార్లు ఉండనున్నాయి. ఈ మెట్రో కారిడార్ల ద్వారా స్టీల్‌ప్లాంట్ నుంచి నగరంలోని కీలక ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడి ఉద్యోగులు, ప్రజల రాకపోకలు సులభతరం కానున్నాయి.
వాణిజ్య, రవాణా, పరిపాలనా కేంద్రమైన విజయవాడలో తొలి దశ మెట్రో 38.40 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. దీనికి రూ.10,118 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. పండిట్ నెహ్రూ బస్టాండ్-గన్నవరం, పండిట్ నెహ్రూ బస్టాండ్-పెనమలూరు మధ్య ఈ ప్రాజెక్టు సాగనుంది. గన్నవరం కారిడార్ వల్ల విమానాశ్రయం నుంచి నగరంలోని ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతాల మధ్య ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం అవుతుంది.
మరోవైపు విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ సర్వే వేగవంతంగా సాగుతోంది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం, పెనమలూరు ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. కోచ్ డిపోలు, స్టేషన్ల కోసం మొత్తం 80 ఎకరాల భూమి అవసరమని అంచనా వేయగా, SIA సర్వే పూర్తయిన వెంటనే భూసేకరణకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఈ రెండు నగరాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, కారిడార్ల వెంబడి సరికొత్త వృద్ధి కేంద్రాలు ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక మదింపు ప్రక్రియ పూర్తయి తుది నిర్ణయం వెలువడితే, ఈ డబుల్ మెట్రో ప్రాజెక్టులకు పనులు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.











