ఎమ్మెల్యే అండతో ఇరిగేషన్ శాఖ నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఈఈ కృష్ణమోహన్ సహకారంతో మైనింగ్ మాఫియా సర్వేపల్లి రిజర్వాయర్‌ను కొల్లగొడుతోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మైనింగ్ మాఫియా ఆగడాలతో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే సర్వేపల్లి రిజర్వాయర్ భ్రదత ప్రమాదంలో పడిందన్నారు. ఈఈకి, ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం ఉండటంతో మైనింగ్ మాఫియా రెచ్చిపోతూ చెరువులను దాటి సమీపంలోని ప్రభుత్వ భూముల్లోని సంపదను కూడా కొల్లగొడుతోందన్నారు. మంగళవారం వెంకటాచలం మండలం కంటేపల్లి ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేస్తూ నాలుగు హిటాచీ 200 ప్రొక్లెయిన్లు, 19 భారీ టిప్పర్లు పట్టుబడ్డాయని. 40కి పైగా టిప్పర్లు అన్ లోడింగ్‌కి వెళ్లడంతో తప్పించుకున్నాయన్నారు
ఈఈ కృష్ణమోహన్ దగ్గరుండి..
సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్‌ను అక్రమంగా తవ్వుతున్న యంత్రాలు, వాహనాలను సోమవారం అర్ధరాత్రి ఈఈ కృష్ణమోహన్ దగ్గరుండి తప్పించేశారన్నారు. ఇంతలా అక్రమ మైనింగ్ జరుగుతున్నా జిల్లాలోని మైనింగ్, విజిలెన్స్, ఎస్ఈబీ విభాగాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను తాము అనేక సార్లు వెలుగులోకి తెచ్చినా, సహజ వనరులను కాపాడాలని జిల్లా అధికారులను కోరినా ఎలాంటి స్పందన లేదన్నారు. శనివారం రాత్రి గ్రావెల్ అక్రమ దందాను జీపీఎస్ ఫొటోలు, వీడియోలతో సహా వెల్లడించినా ఎలాంటి చర్యలు లేవన్నారు. సోమవారం రాత్రి గ్రావెల్ తరలించే భారీ వాహనాల ఫొటోలను జీపీఎస్ లొకేషన్‌తో సహా మరో సారి వెలుగులోకి తేగా చర్యలు తీసుకోవాల్సిన ఈఈ కృష్ణమోహన్ తన గుట్టు బయటపడుతుందని అప్రమత్త మయ్యారన్నారు. అర్ధరాత్రి హుటాహుటిన సర్వేపల్లి రిజర్వాయర్‌లోకి వెళ్లి అక్కడ ఉన్న ఐదు భారీ ప్రొక్లెయిన్లను, 50కి పైగా టిప్పర్లను గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి తరలించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సర్వేపల్లి ఎమ్మెల్యే, ఇరిగేషన్ ఈఈ అక్రమాలపై విచారణ జరిపి జిల్లాలోని సాగునీటి వనరులను, సహజ సంపదను కాపాడాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.
Must Read ;- తొవ్వేది గొడవర్రులో,చేప్పేది మద్దూరు.. జోరుగా ఇసుక దందా