మిస్ ఇండియా అనేది నేను కాదు అది ఓ బ్రాండు అంటూ వచ్చిన సినిమా ‘మిస్ ఇండియా’. ఓటీటీలో ఓ టీ గురించి వచ్చిన సినిమా ఇది. నెట్ ఫ్లిక్స్ దీన్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ‘పెంగ్విన్’తో ఓటీటీ స్టార్ గా మారిన కీర్తి సురేష్ ను ఈ సినిమా సూపర్ స్టార్ గా మారుస్తుందా? మిస్ ఇండియా కాస్తా మిస్ ఫైర్ గా మారుతుందా అనే విషయాలను చూద్దాం.
కథలోకి వెళితే..
లంబసింగిలో మొదలైన కథ అమెరికాలో అడుగుపెడుతుంది. మిలిటరీ డాక్టర్ విశ్వనాథం (రాజేంద్ర ప్రసాద్) మనవరాలు మానస సంయుక్త ( కీర్తి సురేష్). శివరామకృష్ణ ( సీనియర్ నరేష్), కమాలదేవి (నదియా)ల కూతురామె. సంయుక్తకు తాతంటే ఎంతో ప్రేమ. తాత పెట్టే టీ ఇంకా ప్రేమ. చిన్నప్పటి నుంచి ఆమె కల ఒక్కటే వ్యాపారం చేసే ఎదగాలని. కానీ ఆమె తండ్రి అల్జీమర్స్ వ్యాధి బారినపడటంతో కుటుంబ బాధ్యతలు అన్నయ్య మీద పడుతుంది. సంయుక్తకు ఇంకో అక్క ఉన్నా ఆమె ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో సంయుక్త తాతయ్య విశ్వనాథం కూడా మరణిస్తాడు.
అన్నయ్యకు అమెరికాలో ఉద్యోగం రావడంతో ఆ కుటుంబమంతా అమెరికా వెళ్లిపోతుంది. అక్కడ సంయుక్త ఎంబీఏ పూర్తి చేస్తుంది. ఆమె వ్యాపారం చేస్తానంటే అన్నయ్య అంగీకరించడు. ఇల్లు గడవాలంటే ఆమె ఉద్యోగం చేసి తీరాల్సిందేనంటాడు. అంతకుముందే ఆమెకు ఓ పార్టీలో విజయ్ ఆనంద్ (నవీన్ చంద్ర) పరిచయమవుతాడు. ఆమె ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లినపుడు ఆ కంపెనీ మేనేజర్ గానూ విజయ్ ఉంటాడు. ఆమెను పెళ్లి చేసుకోడానికి విజయ్ ప్రతిపాదన తెచ్చినా సంయుక్త ఒప్పుకోదు. తను ఏదో సాధించాలంటుంది. ఆమె తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేస్తుంది. విజయ్ కూడా ఆమె జీవితం నుంచి వైదొలగుతాడు.
ఆమె ఏం వ్యాపారం చేయాలనకున్నపుడు తాత పెట్టిన టీ గుర్తొస్తుంది. అమెరికాలో అందరికీ కాఫీ ఇష్టం.. వారికి టీ అలవాటు లేదు. కానీ వారికి టీ రుచిని అలవాటు చేయాలనుకుంటుంది. తనకు సహకారం అందించాల్సిందిగా కె.ఎస్.కె. అనే ఓ కాఫీ సామ్రాజ్యానికి అధినేత కైలాష్ శివ కుమార్ (జగపతిబాబు)ను కలుస్తుంది. అక్కడ ఆమెకు అవమానమే ఎదురవుతుంది. తన లక్ష్యసాధన కోసం ఆమె ఏంచేసింది? ఆమె ఎదుగుదలకు ఎదురైన సవాళ్లు ఏమిటి? అనేదే ఈ సినిమా కథ.
ఎలా తీశారు? ఎవరెలా చేశారు?
కథనే హీరోగా నమ్మి చేసిన సినిమాలా ఇది అనిపిస్తుంది. దర్శకుడు ఈ కథని చాలా సున్నితంగా డీల్ చేశాడు. ఎక్కడా మోతాదు మించకుండా జాగ్రత్త పడ్డాడు. ముఖ్యంగా ఈ కథను వేగంగా ముందుకు నడపడంలో డైలాగులు చాలా ఉపయోగపడ్డాయి. సందర్భానుగుణంగా రచయిత డైలాగులు రాయగలిగాడు. వాటిని తెరకెక్కించడంలో ఆ నైపుణ్యం కనిపించింది. ముఖ్యంగా మానస సంయుక్తంగా కీర్తి సురేష్ మరోసారి తనేమిటో నిరూపించుకోగలిగింది. నటనను పండించడంలో ఆ చాకచక్యాన్ని మరోసారి చూపగలిగింది. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో మెలోడ్రామా ఎక్కువైంది.
కేవలం కీర్తి మీదనే కథను నడిపించాలని దర్శకుడు ముందుగానే అనుకున్నట్లుంది. మరోసారి ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు అందించాలనే తాపత్రయంతో తీసినట్టుంది. ఆమెకు ఓ జోడిని సెలక్ట్ చేసే విషయంలో కూడా ఆ శ్రద్ధ తీసుకున్నాడు.. గుర్తింపు లేని హీరోను ఎంచుకున్నాడు. కథ, కథానాయికే ఇందులో హీరో కాబట్టి ఆ ప్రకారమే కథ నడిచింది. వ్యాపారం అనేది ఓ యుద్దం అనే భావనను దర్శకుడు కల్పించాడు. నేపథ్యం సంగీతం కూడా ఈ సినిమాను మరో మెట్టుపైన నిలిపింది. విశ్వనాథంగా రాజేంద్ర ప్రసాద్ నటన, అల్జీమర్ వ్యాధి గ్రస్తుడి పాత్రలో నరేష్ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక కైలాష్ శివ కుమార్ గా జగపతి బాబు మరోసారి తన ప్రత్యేకతను చాటారు.
ప్లస్ లు.. మైనస్ లు
కీర్తి సురేష్ నటన, ఆమెరికా నేపథ్యం, లొకేషన్లు, డైలాగ్స్, కైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్ గా చెప్పాల్సి ఉంటుంది. కేవలం వ్యాపారమే తప్ప జీవితాన్ని విస్మరించడం కొంత నాటకీయత లోపించినట్లు అనిపిస్తుంది. రెండు సార్లు ఆమెకు పెళ్లి ప్రతిపాదన వచ్చినా ఆమె తిరస్కరించేలా చేయడానికి సరైన కారణం ఏమిటో మనకు అర్థం కాదు. జీవితంలో ఎదగడం ముఖ్యమే గానీ మనకున్న జీవితం త్యాగం చేయడానికి కాదు కదా అన్న భావన కలుగుతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది నీ లక్ష్యం మాత్రమేనని దర్శకుడు చెప్పదలుచుకున్నాడు. ఆ విషయంలో అతనికి క్లారిటీ కనిపించింది. అందుకే అలానే తీశాడు. కొన్ని సన్నివేశాలు లాజిక్ కు అందలేదు. ఆమె జీవితానికి ఓ ముగింపు ఇచ్చి ఉంటే బాగుండేది. సినిమాలో అది లోపించింది. అలా చేస్తే సినిమా టిక్ గా ఉంటుందని దర్శకుడు అనుకుని ఉండొచ్చు.
నటీనటులు: కీర్తి సురేష్, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, నదియా, నవీన్ చంద్ర, కమల్ కామరాజు, ప్రవీణ్, భానుశ్రీ మెహ్రా, పూజిత పొన్నాడ, దివ్య తదితరులు
సాంకేతిక వర్గం: సంగీతం తమన్, దర్శకత్వం: నరేంద్రనాధ్
నిర్మాత: మహేష్ కోనేరు
ఎక్కడ చూడాలి? : నెట్ ఫ్లిక్స్
విడుదల తేదీ: 04-11-2020
ఒక్క మాటలో: మంచి టీ లో కొద్దిగా సుగర్ తక్కువైంది.
రేటింగ్: 3/5
– హేమసుందర్ పామర్తి











