ఛైర్మన్ పదవిపై కినుకు!
అధికారపార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నగరి ఎమ్మెల్యే రోజా.. సొంత పార్టీపైనే ఫైర్ అయ్యారు! తాజాగా శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ నియామకంపై రోజాను తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు తెలుస్తోంది! ప్రభుత్వం ఇటీవలే శ్రీశైలం బోర్డు ఛైర్మన్ గా రెడ్డివారి చక్రపాణి రెడ్డిని నియమిస్తు నిర్ణయం తీసుకుంది. దీంతో ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది! అయితే ఎప్పటి నుంచే స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా, రెడ్డివారి చక్రపాణి రెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గ పరిథిలో స్వపక్షంలోనే ప్రత్యర్థిగా ఉన్న చక్రపాణి రెడ్డిని శ్రీశైలం బోర్డు ఛైర్మన్ గా నియమించడం ఏమిటని రోజా ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్న ఎమ్మోల్యే రోజా.. అవసరం అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనకాడనని ప్రకటించారు.
స్వపక్షంలో ప్రత్యర్థులు..
నగరి నియోజకవర్గంలో పేరుకే రోజా ఎమ్మెల్యే! కానీ పెత్తనమంతా ఆ ఇద్దరు మంత్రులు, ద్వితీయ శ్రేణి నాయకులదే అన్నది అందరికీ తెలిసిన విషయమే!! స్వపక్షంలోనే విపక్షం మాదిరిగా తయారై, నగరి నియోజకవర్గంలో రోజా పెత్తనం సాగకుండా అడ్డుపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ బయటపడిన పొరపచ్చాలు.. నేటికి అధికారపార్టీలో రగులుతూనే ఉన్నాయి. వైసీపీ అవిర్భావం నుంచి చక్రపాణి రెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. నగరి నియోజకవర్గంలోని నిండ్రా మండలానికి చెందని చక్రపాణి వర్గంలోని వారు ఎమ్మెల్యే రోజా నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. రాజకీయాలను శాసిస్తున్నారు. దీనిని రోజా గతంలో పలుమార్లు ఖండించినప్పటికీ.. అధిష్టానం బుజ్జగింపులతో సద్దుకు వస్తోంది. అయితే చక్రపాణి రెడ్డి నియామకాన్ని రోజా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాక ఈ పంచాయితీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే తేల్చుకునేందుకు రోజా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం!











