తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగరా మోగింది. ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు , ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెల్లడించింది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 23న, పరిశీలన 24న, ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 26గా నిర్ణయించారు. మార్చి 14న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 17 జరగనుంది.
తెలంగాణలో అభ్యర్థులు రెఢీ..
తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌తో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా రాములు నాయక్ పేరు ఖరారు చేయగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి మాజీ మంత్రి చిన్నారెడ్డిని ఖరారు చేసింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైంది. బీజేపీ నుంచి రామచందర్‌రావుతో పాటు ఈ స్థానంలో చాలా మంది పోటీలో ఉన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు, జేఏసీ ఛైర్మన్ కోదండరాం, ఉద్యమకారుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ నుంచి జర్నలిస్టు రాణి రుద్రమ, వామపక్షాల తరఫున జర్నలిస్టు జయసారథి రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా మరో జర్నలిస్టు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) తదితరులు బరిలో ఉన్నారు. ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ ఆర్‌ఎల్డీ నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్ బరిలో ఉన్నారు.
Must Read ;- పంచాయతీల తరవాత పరిషత్ ఎన్నికలు
ఏపీలో ఖరారు కాని అభ్యర్థులు
కాగా ఏపీలో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఏపీలోని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు , కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ.ఎస్. రామకృష్ణ స్థానాలు ఖాళీ కానుండడంతో ఎన్నికలు జరుగుతున్నాయి. 2015లో జరిగిన తూర్పు-పశ్చిమగోదారవరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చైతన్యరాజుతో పాటు, ప్రగతి విద్యా సంస్థల అధినేత కృష్ణారావు బరిలో నిలిచారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పీడీఎఫ్ నుంచి రాము సూర్యారావు గెలిచారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ.ఎస్.రామకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. కాగా ఈ సారి ఉపాధ్యాయ సంఘాలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
రంగంలో దిగిన రాజకీయ పార్టీలు
తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డైరెక్ట్‌గా రంగంలోకి దిగాయి. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలు కావడంతో హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే ఏపీలో ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలు, వామ పక్షాలు కీలకంగా మారనున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో పీఆర్టీయూ, యూటీఎప్, పీడీఎప్ సంఘాలు గెలిచినా..వారిపై ప్రత్యక్షంగా రాజకీయ పార్టీల ముద్ర ఉండే అవకాశం తక్కువగా ఉండేది. ఈ సారి వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పార్టీలు డైరెక్ట్‌గా అభ్యర్థులకు మద్దతు ఇస్తాయా లేక ఉపాధ్యాయ సంఘాలకే వదిలేస్తాయా అనేది తేలాల్సి ఉంది. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. ఇప్పటికే ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యవేక్షణలోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలూ జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం పర్యవేక్షణకు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల సంఘ పర్యవేక్షణకు స్పష్టమైన తేడా ఉంటుంది. పరిమిత సంఖ్యలో ,రిజస్టరైన ఓటర్ల వరకే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణలు, వివాదాలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవని చెప్పవచ్చు.
Also Read ;- ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల