దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. ఖర్చుల పరంగా ఎంతో మేలు జరుగుతుందనేది ప్రధాని నరేంద్రమోదీ అభిభాషణ. అయితే ఈ ఆలోచన వెనుక గోప్యంగా.. రాజకీయ వక్ర ప్రయోజనాలు ఉన్నాయనేది పలువురి అభిప్రాయం.
ఒకే దేశం ఒకే పన్ను పేరుతో అతి పెద్ద ఆర్థిక సంస్కరణలు– GST అమలు, రైతులు వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత మార్కెట్లలోనే కాకుండా ఎక్కడైనా అమ్ముకోవచ్చనే లక్ష్యంతో ఒకే దేశం-ఒకే మార్కెట్ , ఒకే దేశం- ఒకే పరీక్ష, ఒకే దేశం-ఒకే రేషన్ తెచ్చారు. తాజాగా ప్రధాని మోదీ చేసిన ఒకే దేశం- ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) అంశం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
1960వ దశకం నుంచి జమిలి ఎన్నికలపై చర్చ నడుస్తూనే ఉన్నా.. మోదీ ప్రభుత్వం దానిపై వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. జమిలి ఎన్నికలపై మోదీ చేసిన ప్రకటన నిన్నటికి నిన్ననే అనుకుని చేసింది కాదు. చాలా రోజులనుంచి కసరత్తు జరుగుతోంది. కాకపోతే గత ఏడాది జూన్ లో జరిగిన అఖిలపక్ష సమావేశం తరువాత మోదీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఆ అఖిల పక్ష భేటీకి 40 పార్టీలను ఆహ్వానించగా 21 పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. మరో 3 పార్టీలు లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు తెలిపాయి. సీపీఎం, సీపీఐ, జేడీయూ, శిరోమణి, బీజేడీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల అధినేతలు హాజరయ్యారు. కాంగ్రెస్, తృణమూల్, బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే, తెదేపా, ఆమ్ ఆద్మీతో పాటు శివసేన కూడా సమావేశానికి రాలేదు. వీటిలో కొన్ని పార్టీలు.. తాము ఇంకా దీనిపై చర్చించలేదని, తరువాత అభిప్రాయం తెలుపుతామని చెప్పాయి.
మోదీ చెప్పిన ప్రకారం.. ఏడాది పొడవుగా దేశంలో ఎక్కడోచోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. తద్వారా ఎన్నికల ఖర్చు పెరగడంతోపాటు.. అభివృద్ధి పనులను ఆటంకం ఉంటుందని, పాల.నా సౌలభ్యం ఉండదని, ఇది చర్చించే అంశం మాత్రమే కాదని, దేశానికి అవసరమని ప్రధాని మోదీ ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో వ్యాఖ్యానించడంతో మళ్లీ చర్చ మొదలైంది.
వాస్తవానికి దేశంలో 1967 వరకు జమిలి ఎన్నికలే జరిగాయి. 1971 తర్వాత వేరువేరుగా నిర్వహించడం మొదలైంది. దీనికితోడు 1970ల్లో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పులు, మధ్యంతర ఎన్నికలు జరగడం మొదలైంది. తరువాతి కాలంలో కేంద్రంలోని ప్రభుత్వాలు ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోవడంతో లోక్ సభ కూ మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.
Must Read ;- ఆమె కూడా మోదీ బాటలోనే వెళ్లనున్నారా..?
ఖర్చు విషయానికి వస్తే..
ఎన్నికల సంఘం ప్రకారం మన దేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలకు కలిపి 4,900 కోట్లు అవుతుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల ఎన్నికలకు అయ్యే ఖర్చును సగం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే..రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చు దృష్టితో చూస్తే జమిలి ఎన్నికలు రాష్ట్రాలకు కొంత ఆర్థిక ఊరటను కలిగిస్తాయనడంలో సందేహం లేదు.
ఏళ్లతరబడి ఎన్నికలు..
2014–19 మధ్య జరిగిన ఎన్నికల ప్రచార సమయాన్ని పరిశీలిస్తే మొత్తం ఐదేళ్లలో రెండేళ్లు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. 2020నుంచి కూడా మళ్లీ అదే పరిస్థితి రానుంది. వచ్చే సంవత్సరం పశ్చిమబంగా ఎన్నికలు, 2022 ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ ఎన్నికలు జరుగునున్నాయి. 2022 అక్టోబర్, డిసెంబర్ నెలల్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. అంటే దేశంలో ప్రతి ఆరునెలలకి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం సాధారణమైంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై పార్టీలను ఒప్పించి.. ఈ 2022 ,2023, 2024లో జరగాల్సిన ఎన్నికలను కూడా అవసరమైనంత కాలం వాయిదా వేయడమో, ముందుకు జరపడమో చేసి- దేశ వ్యాప్తంగా లోక్ సభ, అన్ని అసెంబ్లీలు, స్థానిక ఎన్నికలను ఒకేసారి జరిపించాలన్నది మోదీ సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు లా కమిషన్, ఎన్నికల సంఘం కూడా సానుకూల నివేదికలు సమర్పించాయి. ఇక ఈ విధానం అమలు కావాలంటే ఉభయ సభల్లో ఆమోదం తోపాటు రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది.
రాజ్యాంగ సవరణ విషయానికి వస్తే..
74, 75 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నగరపాలిత ప్రాంతాలకు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. ఈ రెండు రాజ్యాంగ సవరణలలో పొందుపరిచిన 343(ఇ)4, 343(యు) 4 ప్రకరణల ద్వారా ఐదేళ్ల మధ్యకాలంలో ఏదైనా పంచాయతీలో కానీ నగరపాలిత ప్రాంతంలో కానీ మళ్లీ ఎన్నికలు జరిగితే, ఎన్నికైనవారు స్థూల కాల పరిమితిలోనుంచి మినహాయించి.. శేష సమయానికి మాత్రమే తమ విధులను నిర్వహిస్తారు. అంటే సదరు పంచాయతీ పాలకవర్గం సభ్యుడి మూడేళ్ల కాల పరిమితి ముగిశాక.. ఆ స్థానంలో ఎన్నికలు జరిగితే.. ఐదేళ్ల పదవీ కాలంనుంచి ఆ మూడేళ్ల పదవీ కాలం మినహాయిస్తారు. అంటే మిగిలిన రెండేళ్లకు మాత్రమే ఆ ఉప ఎన్నిక ఉంటుంది. శాసనసభ్యులకూ ఇదే వర్తిస్తుంది. అయితే మొత్తం సభకు ఇది వర్తించదు. సభ్యులకు మాత్రమే ప్రస్తుతం వర్తించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో వర్తింపజేసేందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే..
ఉమ్మడి ఏపీ (2014 తెలంగాణ, ఏపీ) అసెంబ్లీ ఎన్నికల గడువు లోక్‌సభ గడువు సరిపోవడంతో లోక్ సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుపుతున్నారు. 2009వరకు కొన్ని సార్లు మినహా ఉమ్మడి ఏపీలో, 2014లో తెలంగాణ, ఏపీలో అదే తరహా ఎన్నికలు జరిగాయి. 2018లో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడంతో నిర్ణీత సమయానికంటే 9నెలల ముందు ఎన్నికలు జరిగాయి. 1955, 1978, 1980, 1983, 1984, 1985లో ఉమ్మడి ఏపీలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1989లో లోక్ సభ ఎన్నికలతోపాటుగా ఎన్టీఆర్ అసెంబ్లీ ఎన్నికలకూ వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2004లో చంద్రబాబుకీ అదే జరిగింది.
Also Read ;- ఎన్నికల కమిషనర్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!
దేశంలో జమిలి ఎన్నికలు ఇక్కడ..
1989 సాధారణ ఎన్నికల నుంచి వేర్వేరు రాష్ర్టాల్లో 31సార్లు జమిలి ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1989, 1999, 2004, 2009) ఏపీ, తెలంగాణ- 2014, ఒడిశా (2004, 2009, 2014), కర్ణాటక (1989, 1999, 2004), సిక్కిం (2009, 2014), తమిళనాడు (1989, 1991, 1996), మహారాష్ట్ర (1999), అసోం (1991, 1996), హర్యానా (1991, 1996), కేరళ (1989, 1991, 1996), ఉత్తరప్రదేశ్ (1989, 1991), పశ్చిమబెంగాల్ (1991, 1996), అరుణాచల్‌ప్రదేశ్ (2009, 2014), తెలంగాణ (2014) రాష్ర్టాలు జమిలి ఎన్నికలను చూసినవే
మంచి.. చెడులు..
జమిలి ఎన్నికల ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నా.. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో తెచ్చిన ప్రతిపాదనను అప్పట్లో చంద్రబాబు సమర్థించారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గడం, పాలనా సౌలభ్యం ఉండడంతోపాటు కేంద్ర ప్రభుత్వాల జోక్యంతో, రాజకీయ కారణాలతో రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను కూలదోసే అవకాశం ఉండదు. ఒక వేళ కూలదోసినా.. శేష కాలం మాత్రమే ఆ ప్రభుత్వం అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది.
అదే సమయంలో ప్రతికూల అంశాలూ ఉన్నాయి. ఐదేళ్లవరకు తమకు ఎవరూ తొలగించలేరన్న కారణంలో ప్రభుత్వాలు నియంత విధానాలను అనుసరించవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. దీంతోపాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో ప్రజలు జాతీయస్థాయి అంశాలను,రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎన్నుకునే విషయంలో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని, ఒకే సారి ఎన్నికలు జరిపితే ఓటరుపై ప్రభావం ఉంటుందని చెప్పేవారూ ఉన్నారు. వెరసి జాతీయ పార్టీలకే లాభిస్తుందనే వాదనా ఉంది. మెజార్టీ కోల్పోయిన సందర్భాల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాల పరిస్థితి ఏంటనే విషయంపైనా ఇంకా చర్చ జరగాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అన్న నినాదం దేశ సమాఖ్య వ్యవస్థకు భంగం కల్గిస్తుందనే వాదనాలూ ఉన్నాయి.
ఒకే ఓటరు జాబితా..
దేశమంతా వార్డు స్థాయినుంచి.. లోక్ సభ వరకు ఒకేసారి ఎన్నికలు జరగాలంటే..ఒకే ఓటరు జాబితా అవసరం ఉంటుంది. ఇదే విషయన్ని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అది జరగాలంటే కూడా రాజ్యాంగ సవరణ అవసరం. రాజ్యాంగంలోని 243కే, 243 జెడ్‌ఏలను సవరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో గతంలో ఈసీ, లా కమిషన్, న్యాయ శాఖ, పంచాయతీరాజ్ విభాగాలు సానుకూలంగా స్పందించాయి. స్థానిక ఎన్నికల్లో ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ మొదలైన అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘాలకు అధికారమిచ్చే 243కే, 243జెడ్‌ఏ అధికరణలతో పాటు పార్లమెంటు, శాసనసభ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీలో ఈసీకి అధికారమిచ్చేది ఆర్టికల్ 324(1)ను సవరించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే. ఈ మూడు అంశాలను ఒకేతాటిపైకి తెచ్చే సవరణ కావాలని చెబుతున్నారు. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. ఒకే ఓటరు జాబితాకు, జమిలి ఎన్నికలకు సంబంధం లేదని గతంలో ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వ్యాఖ్యానించడం గమనార్హం.
ముందుకే మోదీ ప్రభుత్వం..
గత ఎన్నికల్లో బీజేపీ ఒకే ఓటరు జాబితా అంశాన్ని ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్తావించింది. ఇప్పటికే దాదాపు 20 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉండడం, కొన్ని చోట్ల బీజేపీ చెప్తే సరే అనే ప్రభుత్వాలు ఉండడంతో ఏడెనిమిది రాష్ట్రాల్లో తప్ప.. మిగతా రాష్ట్రాలన్నీ జమిలికి అంగీకరించడం ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు బీజేపీకి కావాల్సిందలా రాజ్యసభలో మెజార్టీ సాధించించడం.
2015లోనే దీన్ని అమలుచేసేందుకు వ్యూహం రచించినా.. అప్పట్లో రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేకపోవడంతో వెనక్కి తగ్గింది. భాజపాకు లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో ఇంకా బలం కావాలి. ప్రస్తుతం బీజేపీతో పాటు మిత్ర పక్షాలకు దాదాపు 102 మంది సభ్యుల బలం ఉంది. ఈ సవరణలు జరగాలంటే 2/3 వంతు మెజార్టీ కావాలి. అంటే 163 మంది సభ్యుల బలం కావాలి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలతోపాటు మరికొన్ని పార్టీలను ఒప్పిస్తే.. (CAA బిల్లు తరహాలో) మోదీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేసుకునే వెసులుబాటు ఉంది. తరువాత ఈ అంశంపై దేశంలోని సగం రాష్ట్రాల ఆమోదం పొందాలి. అంటే ప్రస్తుతం 15 రాష్ట్రాల్లోని శాసనసభలు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల మద్దతును కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
Also Read ;- ప్రభుత్వానికి పక్కలో బల్లెం నిమ్మగడ్డ
Don’t miss it ;- జగన్ దళానికి జమిలీ దెబ్బ పడుతుందా!!