కొవిడ్ సెకండ్ వేవ్‌ని అరికట్టే విషయంలో అవలంభించిన విధానాలు,అనుసరిస్తున్న పద్ధతుల నేపథ్యంలో ప్రధాని మోదీ చరిష్మా దారుణంగా పడిపోతోందని పలు అంతర్జాతీయ,జాతీయ సంస్థల సర్వేల్లో వెల్లడవుతోంది.అదే సమయంలో కొవిడ్ వ్యాప్తికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని దేశంలో కీలకంగా ఉన్న RSS కూడా చెప్పడంతో బీజేపీ వారే షాక్ తినాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.అమెరికా డేటా ఇంటిలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం కొవిడ్‌కి ముందు,కొవిడ్ తరువాత పరిస్థితులను పోల్చితే భారత ప్రధాని మోదీ 22 పాయింట్లు కోల్పోయారు.మోదీ రేటింగ్ ప్రస్తుతం 63 శాతానికి దిగజారిందని సదరు సంస్థ వెల్లడించింది.ప్రపంచంలోని 13 మంది ప్రభావవంతమైన ముఖ్య నేతల రేటింగ్‌ను నిరంతరం ట్రాక్ చేస్తున్న మార్నింగ్ కన్సల్ట్ సంస్థ మోదీ జనాదరణను 2019 ఆగస్టు నుంచి ట్రాక్ చేస్తూ వస్తోంది.
ఆసియా టైమ్స్,యూగవ్ కూడా..
ఇక హాంకాంగ్ నుంచి వెలువడే ఆసియా టైమ్స్‌తో పాటు బ్రిటన్‌కి చెందిన యువర్ గవర్నమెంట్ (యూగవ్) పోలింగ్ ఏజన్సీలు కూడా మోదీ ప్రతిష్ట దిగజారిందని తేల్చాయి.దేశంలోని పలుచోట్ల ఆక్సిజన్ అందక కొవిడ్ బాధితులు అల్లాడిపోతున్న విషయంలో మోదీ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ మీడియా ఏకేస్తున్న తరుణంలో తాజా సర్వేలు బీజేపీకి మరింత షాక్ అని చెప్పవచ్చు.2020 ఏప్రిల్‌తో పోల్చితే 2021 ఏప్రిల్‌లో మోదీ పనితీరు దిగజారిందనే అభిప్రాయాన్ని ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారని యూగవ్ వెల్లడించగా, మోదీకి ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలు,వ్యక్తిగత ప్రతిష్ట ముఖ్యమయ్యాయి అంటూ ఆసియాటైమ్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
సి-ఓటరు సర్వేలోనూ..
అదే సమయంలో దేశంలో ఎన్నికల సర్వేలు నిర్వహించే సి-ఓటరు సంస్థ నిర్వహించిన సర్వేలోనూ మోదీ చరిష్మా తగ్గినట్టు వెల్లడైందని రాయిటర్స్ సంస్థ పేర్కొంది.ధిల్లీ,మహారాష్ట్ర,యూపీ లాంటి రాష్ట్రాల్లో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులకు కేంద్రం కూడా కారణమనే అభిప్రాయం ఉందని వెల్లడించినట్టు అభిప్రాయ పడింది.అయితే 2024 వరకు ఎన్నికలు లేకపోవడాన్ని కూడా ప్రస్తావించింది.సి-ఓటరు సర్వేలో మోదీ గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా చరిష్మాను కోల్పోయినట్లు తెలిపింది.ఏడాది క్రితం తమ సర్వేలో 65శాతం మంది సానుకూలత వ్యక్తం చేయగా ఇప్పుడు 35 శాతానికి పడిపోయిందని వెల్లడించింది.
Must Read ;- అందరి దృష్టి భారత్‌పై.. మోదీ పరపతికి దెబ్బ?
న్యాయస్థానాలూ కన్నెర్ర..
కాగా కొవిడ్ నియంత్రణకు సంబంధించి పలు రాష్ట్రాల హైకోర్టులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాయి.బీహార్‌లో ‘మీరు లాక్ డౌన్ పెట్టకపోతే మేమే పెట్టాల్సి వస్తుంది’ అని పాట్నా హైకోర్టు వ్యాఖ్యానించడం,ప్రజారోగ్యమే అన్నిటి కంటే ప్రాధాన్యమైన అంశమని రాజ్యాంగబద్ధ వ్యవస్థలకు,సంస్థలకు గుర్తు చేయాల్సి రావడం విచారకరమని,ఎన్నికల సంఘంపై మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది.పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న సమయంలో ఎన్నికల ర్యాలీలను అనుమతించిన మీపై హత్యా నేరం ఎందుకు మోపకూడదని వ్యాఖ్యానించడం కూడా సంచలనం రేపింది.దేశ ప్రజలు మరణించాలని అనుకుంటున్నారా అని ధిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.ఇక యూపీలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను దేవుడే కాపాడాలని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.తెలుగు రాష్ట్రాల్లోనూ హైకోర్టులు కొవిడ్ నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నాయి.ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వ్యాక్సిన్ల సరఫరా,ఆక్సిజన్ సరఫరా లాంటి విషయాల్లో కేంద్రానికి కూడా బాధ్యత ఉందనే విషయంపై క్షేత్రస్థాయిలోనూ చర్చ నడుస్తోంది.
ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు..
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ రెండు రోజుల క్రితం చేసి వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు బీజేపీని షాక్‌కి గురి చేశాయి.కొవిడ్-19 తొలిదశ తరువాత సెకండ్ వేవ్ కంటే ముందు దేశంలోని అన్ని వర్గాల్లోనూ నిర్లక్ష్యం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.ప్రస్తుత దుస్థితికి ఆ వైఖరే కారణమన్నారు. ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేశాయని వ్యాఖ్యానించారు.‘పాజిటివిటీ అన్లిమిటెడ్’ పేరుతో జరిగిన కార్యక్రమంలో మోహన్ భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.సాధారణంగా అయితే ఆర్ఎస్ఎస్ నేతలుఎవరూ బీజేపీ పాలనపై ప్రత్యక్షంగా కాని,పరోక్షంగా కాని వ్యతిరేక వ్యాఖ్యలు చేయరు.అలాంటి సందర్భాలు ఇప్పటివరకు పెద్దగా బయటకు రాలేదు. సమస్యలు తలెత్తినప్పుడు నాగ్‌పూర్ కార్యాలయానికి మాత్రమే ఆ చర్చలు పరిమితం అవుతాయి.అయితే ఇప్పుడు బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే..అంతర్గతంగా ఈ అంశాలపై లోతైన చర్చ జరిగి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read ;- మోదీ భారత్.. The Failed State