కరోనాతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం మొదట మూడు నెలల పాటు మారటోరియం విధించింది. కానీ పరిస్థితులు సర్దుకోకపోవడంతో మరో మూడు నెలలు పొడిగించింది. దాదాపు 31 శాతం మంది ఈ అడ్వాంటేజ్ ను వాడుకున్నారు. కేంద్రం ఇచ్చిన వెసలుబాటు గస్ట్ 31తో పూర్తయింది. దీంతో కేంద్రం మరోమారు గడువు పెంచుతుందా? లేదా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల వరకు మారటోరియం గడువు పెంచేందుకు సన్నద్ధమవుతున్నట్టు సుప్రీం కోర్టుకు సొలిసిటర్ జనరల్ విన్నవించారు. అన్ లాక్ లో సడలింపులు ఇస్తున్నా ఇంకా చాలా రంగాలు ప్రారంభం కాలేదు.
ప్రజలు కూడా ఆర్థిక వెసులు బాటు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ మారటోరియాన్ని పొడిగిస్తే మొండి బకాయిలు పెరిగిపోతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఏకంగా బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు. హెచ్డీఎఫ్సీబ్యాంకు చైర్మన్ కామత్ కూడా ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాలను ఎగవేస్తారని హెచ్చరించారు. అసంఘటిత కార్మికులు, దినసరి కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులలో ఉన్నారు. ఇదే సమయంలో ఉద్యోగాలు ఉన్నావారు కూడా సగం జీతంతోనే గడపవలసి వస్తోంది. దీంతో కేంద్రం కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు అర్ధమవుతోంది.
కేంద్రం ప్రకటించిన 21 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా ఆర్థిక ఉద్దీపనకు ఉపయోగపడలేకపోయింది. రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితుల రుణాలను కూడా రెన్యూవల్ చేసేందుకు ఒప్పుకొని ప్రభుత్వం హెలికాఫ్టర్ మనీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికే ఆర్థిక మంత్రి కరోనా దైవ ప్రక్రియ లాంటి బేలతనపు మాటలు మాట్లాడుతూ విమర్శలు పాలవుతున్నారు. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు రాకముందే కేంద్రం జాగ్రత్త పడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమవుతోంది. ఆర్బీఐ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రెండేళ్ల వరకు మారటోరియం గడువు పెంచేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిపారు. ప్రజలకు ఈ నిర్ణయం మేలు చేయనుంది. ఇదే సమయంలో ఈఎంఐలపై అదనపు వడ్డీ విధించొద్దని సుప్రీం పేర్కొంది. చెల్లించని ఈఎంఐలపైనా పెనాల్టీ విధించొద్దని ఆదేశించింది. పూర్తిస్థాయిలో వాదనలు వినేందుకు విచారణను రేపటికి వాయిదా వేసింది. కేంద్రం తీసుకునే రెండేళ్ల నిర్ణయం బ్యాంకుల వ్యవస్థను చిన్నాభిన్నం చేయనుంది. వాటికి అండగా కేంద్రం నిలవలసి ఉంది.