ఫార్మాస్యూటికల్ సెక్టార్‌లో ఇండియా ఆత్మనిర్భరత సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని, ఇందులో ఏపీలోని కాకినాడ కీ-రోల్ ప్లే చేస్తోందని ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ND TV వరల్డ్ సమ్మిట్ – 2026 సదస్సులో మోదీ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్‌మీడియాలో పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.
మోదీ ఏమన్నారంటే..
సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ..భారతదేశ ఫార్మా శక్తి ప్రపంచానికే తెలుసు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఔషధాల తయారీకి అవసరమైన రో-మెటీరియల్స్ కోసం భారత్ భారీగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడేది. ముఖ్యంగా యాంటీబయోటిక్స్ తయారీకి అత్యంత కీలకమైన పెన్సిలిన్-జి ఉత్పత్తి గత రెండు మూడు దశాబ్దాలుగా దేశంలో దాదాపు నిలిచిపోయింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన PLI – Production Linked Incentive స్కీమ్ ద్వారా ఆ పరిస్థితి పూర్తిగా మారుతోందన్నారు మోదీ. చాలా ఏళ్ల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ‘పెన్సిలిన్-జి’ స్వదేశీ ఉత్పత్తి మళ్లీ ఘనంగా ప్రారంభమైందని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
API – Active Pharmaceutical Ingredientsఔషధ ముడిపదార్థాల డొమెస్టిక్ సప్లై చైన్‌ను బలోపేతం చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సక్సెస్ అవుతున్నాయన్నారు ప్రధాని మోదీ. PLI స్కీమ్ కింద ఫార్మా రంగంలో ఇప్పటివరకు రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, దాదాపు 40కి పైగా ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వివరించారు. ఈ ప్రాజెక్టులు ఇప్పు భారత్‌ను సంపూర్ణ ఆత్మనిర్భరత వైపు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రధాని వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో ఇండియా సాధిస్తున్న ఆత్మనిర్భరత ప్రయాణంలో కాకినాడ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ గర్వకారణంగా నిలిచిందంటూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోదనడానికి కాకినాడ ఫార్మా హబ్ సాధించిన ఈ విజయమే నిదర్శనమన్నారు.











