వర్షాకాలం ముగింపు దశకు వచ్చింది. ఈ పాటికే దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ వర్షాకాల సమావేశాలు జరిగిపోయాయి. పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో కూడా వర్షాకాల సమావేశాలు జరిగిపోయాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే వర్షాకాలం ముగింపు దశకు వచ్చినా ఇంకా ప్రారంభం కాలేదు. అయితే కరోనా కారణంగా ఈ సమావేశాలు నిర్వహించడం ఆలస్యమైందని అధికార వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా ప్రతిపక్షాలు మాత్రం చాలా ఆతృతగా వేచి చూస్తున్నాయి.
ఈ వర్షాకాల సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పట్టేందుకు అన్ని అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నానాటికీ దిగజారడంతో పాటు అప్పుల భారం ఎక్కువ కావడం కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. దీనిపై శ్వేతప్రతం డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కరోనా చర్యలపై పట్టు…
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావం దేశంలో ఇతర రాష్టాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. దీనిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగా లేవని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఏ ఆసుపత్రిలోనూ సరైన సౌకకర్యాలు లేవంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఈ దశలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో కరోనా చికిత్స, బాధితులకు సహాయం వంటి అంశాలపై తెలుగుదేశం పార్టీ శాసనసభను స్థంబింపజేసే అవకాశాలున్నాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో ఇదే ప్రధాన ఎజెండాగా తెలుగుదేశం పార్టీ కత్తులు నూరుతోంది.
రాజధానిపై పట్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కాదని, మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకురావడంతో రాజధాని రైతులు ఆందోళన బాట పట్టారు. వీరికి తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతోంది. గవర్నర్ కూడా మూడు రాజధానుల అంశానికి ఓకే చెప్పడంతో విశాఖపట్నంలో పాలనా రాజధాని పనులు చకచకా జరిగిపోతున్నాయి. అమరావతి శాసన రాజధానిగా మారుతుందని, న్యాయ రాజధానిగా కర్నూలు తెరపైకి రావడంతో ఈ అంశంపై శాసనసభలో తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలబడే అవకాశాలున్నాయి. అలాగే న్యాయమూర్తులపైనా, న్యాయస్థానాలపైనా అధికార పార్టీకి చెందిన వారు చేస్తున్న విమర్శలు కూడా ఈ సమావేశాల్లో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా చెబుతున్నారు.
సంఖ్యా బలం తక్కువే…
తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలం తక్కువగానే ఉంది. ఆ పార్టీ నుంచి గత నెలలో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. వీరిలో ముగ్గురు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి అదికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కు అనుకూల సభ్యుగా చేరిపోయారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 20 కి పడిపోయింది. ఆ సంఖ్యతో శాసనసభలో నెగ్గుకురాగలరా అనేది పెద్ద ప్రశ్న.
బాలుకి భారతరత్నపై తీర్మానం
ఇటీవలే స్వర్గస్తులైన గాన గాంధర్వుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న ఇవ్వాలంటూ ప్రధానికి లేఖ రాశారు. వర్షాకాల సమావేశాలలో ఈ విషయంపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఏపీ ముఖ్యమంత్రికి ఈ అంశంపై లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం సభలో తీర్మానం ప్రవేశపెడితే ఏకగ్రీవ ఆమోదంతో కేంద్రానికి పంపే అవకాశం ఉంది.