హీరో కృష్ణ కెరీర్ లో ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా ఓ మైలు రాయి. అప్పట్లో మెకన్నాస్ గోల్డ్ అనే ఓ హాలీవుడ్ సినిమా ఓ సంచలనం. మొత్తానికి ఆ తరహా కథ, కథనాలతో తెరకెక్కింది మోసగాళ్లకు మోసగాడు. తెలుగులో కౌబోయ్ చిత్రాలకు నాంది పలికింది ఈ సినిమానే. దీనికి నిర్మాత జి. ఆదిశేషగిరిరావు. దీనికి కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించారు. హాలీవుడ్ చిత్రాలను తలపింపచేసే సాహసకృత్యాల నేపథ్యంలో మొదటిసారి ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. పద్మాలయ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా 1971ఆగస్ట్ 27న విడుదలైంది.
ఉన్నత సాంకేతిక విలువలతో…
ఆ రోజుల్లోనే టెక్నికల్‌గా చాలా హై వ్యాల్యూస్‌తో వచ్చే హాలీవుడ్ సినిమాలతో పోటీపడింది ఈ సినిమా. కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం, వి.ఎస్.ఆర్. స్వామి ఫోటోగ్రఫి, కోటగిరి గోపాలరావు ఎడిటింగ్, ఆరుద్ర కథ వెరసి మోసగాళ్లకు మోసగాడు సినిమా. అప్పటిదాకా ఆరుద్ర పాటలే ఎక్కువగా రాసేవారు. హాలీవుడ్ స్థాయి నిర్మాణానికి అనుగుణంగా ఆ కథ రాశారు. దీనికి ఆదినారాయణ సంగీతం సమకూర్చారు. ఆయనేంటి వెస్ట్రన్ మ్యూజిక్ ఏంటి అన్నవారు ఆ తర్వాత నోరు మూసేశారు. ఆ సినిమాకు చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ పెద్ద సంచలనమే.
ఈ సినిమా గురించి నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ `మోసగాళ్ళకు మోసగాడు’ పద్మాలయ బ్యానర్‌లో నేను నిర్మాతగా తీసిన రెండో సినిమా. ఘన విజయంతో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి కూడా మా సినిమాలలో ఏ సినిమాకు రానన్ని ప్రశంసలు దీనికి వచ్చాయి’ అని వివరించారు. ఆ రోజుల్లో అతి తక్కువ బడ్జెట్‌తో ఆ చిత్ర నిర్మాణం జరిగిందని, అలా అని ఎక్కడా రాజీపడకుండా లోకేషన్స్ పరంగా రాజస్తాన్ ఎడారుల్లో గాని , హిమాలయాల్లోని మంచుకొండల్లో, పాండిచ్చేరి లాంటి ఎర్రమట్టి కోటల్లో ఇలా అనేక ఔట్‌డోర్ లొకేషన్స్‌లో చేసిన కొత్తప్రయోగమే మోసగాళ్ళకు మోసగాడు అన్నారాయన.
పాత్రలే పెద్ద హైలైట్
ఈ సినిమాకి హీరో హీరోయిన్లుగా కృష్ణ, విజయనిర్మల పెద్ద హైలైట్ గా నిలిచారు. ఈ తరహా పాత్రలను కృష్ణ అవలీలగా పోషించగలరని అర్థమైంది. నాగభూషణం, జ్యోతిలక్ష్మీ, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి , జగ్గారావు, ఆనంద మోహన్, త్యాగరాజు లాంటి వారు కూడా తోడవడంతో సినిమాకు మరింత నిండుతనం వచ్చింది. నిజానికి కృష్ణ వైవిధ్యం కోసమే ఈ సినిమా చేయాల్సి వచ్చిందట. ఆ రోజుల్లో అసాధ్యుడు, గూఢచారి 116, అవేకళ్లు లాంటి యాక్షన్ పిక్చర్స్ వచ్చినా ఫ్యామిలీ పిక్చర్స్ ఎక్కువగా అలవాలైపోవడంతో ఆ సమయంలో కొంచె బ్రేక్ కావాలనుకున్నారు కృష్ణ. అందులోనూ ఆ సినిమాకు ముందు ఏడెనిమిది సినిమాలు సరిగా ఆడలేదు. అందులో వీరు తీసిన ‘అగ్నిపరీక్ష’ కూడా ఉంది.
‘ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే పెద్ద పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేస్తుండేవారు. వారికి పోటిగా ఎదగాలన్న ప్రయత్నంలో హాలీవుడ్ సినిమాలు ఎక్కువ ప్రభావం చూపిస్తుంటే ఆ ఒరవడిలో మనం కూడా మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా తీస్తే బాగుంటుంది అన్న ఆలోచనే ‘మోసగాళ్ళకు మోసగాడు’ తీసేలా చేసింది. మా బ్యానర్‌లోనే తొలి ప్రయత్నంగా మోసగాళ్ళకు మోసగాడు సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అప్పటికి కలర్ సినిమాలని ఎక్కువగా ప్రోత్సహించేవారు కాదు డిస్ట్రిబ్యూటర్స్.
అయినా సరే వారిచ్చిన దాంట్లో నుండే సినిమా తీశాం. ఆ సినిమా లక్కీగా తెలుగుతో పాటు తమిళ, హిందీ, బెంగాలీ, మలయాళంలోనూ సినిమా ఆడింది. కర్నాటకలో తెలుగు వెర్షన్ అయినా బాగా ఆడింది. అలాగే ఇంగ్లీష్‌లో డబ్బింగ్ చేశాం. ఫారెన్ లో అనేక భాషల్లో డబ్బింగ్ కి వెళ్లిన తొలి సినిమా `మోసగాళ్ళకు మోసగాడు. ఆ తర్వాత ఈ సినిమా స్ఫూర్తితో చాలా ఎక్స్ పెరిమెంట్స్ చేశారు కృష్ణ’ ఆదిశేషగిరిరావు వివరించారు. ఇప్పటికీ ‘మోసగాళ్ళకు మోసగాడు’ షూటింగ్ జరిగే రోజులే మాకు గుర్తుకొస్తుంటాయి అన్నారాయన.