పెళ్లి.. ఈ మాట వింటేనే సినిమా రంగంలో భయంగా ఉంది. ప్రస్తుతానికి ఈ భయం సినిమా రంగంలో ఎక్కువగా ఉన్నా బయట కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఉన్నాయి.
తెలుగు సినిమా రంగంలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో చూడాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరంటే హీరో ప్రభాస్ అనే చెప్పాలి. ఆయన వయసు 42 ఏళ్లు. రామ్ పోతినేని, అక్కినేని అఖిల్, శర్వానంద్ లాంటి బ్యాచ్ చాలా మందే ఉన్నారు. పాత తరం నటీమణుల్లో కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నవారు ఉన్నారు. నాడు శోభన నుంచి నేటి అనుష్క దాకా ఇదే బాటలో పయనిస్తున్నారు. తమన్నా, త్రిష.. పెళ్లిళ్లు కూడా ఇంకా కాలేదు. ఇదంతా చూస్తుంటే సోలో బతుకే సో బెటర్ అని వీరు అనుకున్నట్టు ఉంది. పోనీ పెళ్లి చేసుకున్న తారలు సుఖంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. ఆ పెళ్లిళ్లు కాస్తా పెటాకులుగా మారుతున్నాయి.
డబ్బున్నా బంధాలు నిలబడటం లేదు
సాధారణంగా డబ్బున్న కుటుంబాల్లో ఎలాంటి సమస్యలూ లేవనుకుంటారు. కానీ అది నిజం కాదని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. మన తెలుగు పరిశ్రమలో కృష్ణ, విజయనిర్మల దాంపత్యమే అందరికీ ఆదర్శంగా నిలిచింది. నాటి తరంలో సినిమా పెళ్లిళ్లు చాలా జరిగినా ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవలేదు. శరత్ బాబు, రమాప్రభల వివాహబంధమే అందుకు ఓ ఉదాహరణ. సమంత, నాగచైతన్యలు విడిపోనున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. అవన్నీ పుకార్లు అని చాలా మంది అనుకున్నా ఆ తర్వాత అదే నిజమైంది.
వారు విడిపోతున్నట్లు అధికారికంగానే ఆ జంట ప్రకటించారు. చిత్ర పరిశ్రమంలో ఈ విడాకుల పర్వం ఈనాటిది కాదు.. ఏనాటి నుంచో ఉన్నదే. అక్కినేని కుటుంబంలోనే చాలా కనిపిస్తాయి. సుమంత్ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లాడినా చివరికి విడిపోయారు. పవన్ కళ్యాణ్ మొదట నందిని పెళ్లిచేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అన్నాలెజినోవాతో ఉంటున్నారు. మంచు కుటుంబానికీ ఇది తప్పలేదు. మంచు మనోజ్, ప్రణతి రెడ్డిలది అదే పరిస్థితి.
సింగర్ సునీత, కిరణ్ లది ప్రేమ వివాహం. ఇప్పుడు సునీత్ మ్యాంగో రామ్ ను పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ అమలా పాల్, ఏఎల్ విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయారు. హీరోయిన్ కళ్యాణి, దర్శకుడు సూర్యకిరణ్ ల బంధం కూడా మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. నటుడు ప్రకాష్ రాజ్ డిస్కో శాంతి సోదరి లలిత కుమారిని పెళ్లిచేసుకుని విడాకులు ఇచ్చేశారు. ఇలా చెప్పుకుంటే పోతే పెద్ద జాబితానే తయారవుతుంది. తెలుగులోనే కాదు తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఇదే పరిస్థితి. కమల్ హాసన్, అరవిందస్వామి లాంటి వారు, బాలీవుడ్ లో అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ ల పరిస్థితి కూడా అంతే.
ఈ బంధం మున్నాళ్ల ముచ్చటగా మారాక పెళ్లికి దూరంగా ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. తెలుగులో ప్రభాస్ ఎలాగో, హిందీలో సల్మాన్ ఖాన్ పరిస్థితి కూడా అంతే. వీరికి సినిమా వాళ్లు అని పిల్లనివ్వడం లేదా? వీరే పెళ్లికి దూరంగా ఉంటున్నారా? అన్నది కూడా మిలియన్ డాలర్ ప్రశ్నే. ఫలానా హీరోయిన్లతో వీరికి సంబంధాలు ఉన్నాయంటూ పుకార్లు రావడం కూడా వీరి పెళ్లికి మైనస్ గా మారుతోంది. పెళ్లి చేసుకుని విడిపోయేకంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ గా ఉండటమే మేలన్న అభిప్రాయం వీరికి ఉన్నట్టుంది.











