అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ఘనచరిత్ర అందరికీ తెలిసిందే. సంక్షేమపథకాలంటూ ఉచితంగా జనానికి డబ్బులు పంచిపెడుతూ ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు సైతం ఇవ్వకుండా ఎంత ఇబ్బందులకుగురి చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ప్రతి నెలా అప్పులు తెచ్చి పెడుతూ పాలననుగట్టెక్కిస్తున్న జగన్ అమరావతి అభివృద్దిని గాలికొదిలేశారు. లక్షల మంది అమరావతిని రాజధానిగా చేయాలని కోరుతున్నా నిర్లక్ష్య పూరిత ధోరణితో మూడు రాజధానుల పాట పాడుతూనేఉన్నారు.
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడంలో సీఎం జగన్నుమించిన వాడు లేడన్న విమర్శలు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. కారులో వెళ్లే పర్యటనలకు సైతం హెలికాప్టర్ ఉపయోగించటం వంటి విమర్శలు వెల్లువెత్తుతున్నా జగన్ చెవికెక్కటం లేదు. అదే ధోరణి కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా తాను పట్టిందానికి మూడే కాళ్లనట్టు వ్యవహరిస్తోన్న సీఎం జగన్ ఇప్పుడు మరో సారి తీవ్ర విమర్శలకు గురవుతున్నారు.
పరిపాలనా రాజధాని అంటూ విశాఖకు మకాంమార్చబోతున్నారు సీఎం. జగన్ దీని కోసం అందాల రుషికొండకు గుండు కొట్టి ఓ అధునాతన భవంతిని నిర్మించుకుంటున్నారు. దాదాపుఆర్నెల్ల నుంచి ప్రభుత్వ యంత్రాంగంలో పలు శాఖలు రాత్రీ, పగలూ కష్టపడుతూ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేసుకుని ఉత్తరాంధ్ర సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలని జగన్ ఆలోచన. నాలుగేళ్ల పాలనలో గుర్తుకురానివన్నీ ఇప్పుడు జగన్కు గుర్తుకొస్తున్నాయి.
ఇలాంటి విమర్శలు మామూలే అన్నట్టు సీఎం జగన్ వ్యవహరించడం సర్వసాధారణం. విశాఖ క్యాంప్ కార్యాలయంలో ఖర్చు గురించి మాత్రం జనం నోరెళ్లబెడుతున్నారు. ఆ నోటా ఈ నోటా అసలు విషయం తెలుసుకుని భవిష్యత్లో ఇలాంటి పరిణామాలు, విపరీతాలు ఎన్ని చూడాల్సి వస్తుందోనంటూ ఆందోళన పడుతున్నారు. విశాఖ క్యాంప్ కార్యాలయంలో కడుతున్న ఒక్కో బాత్రూమ్ ఖరీదు అక్షరాలా పాతిక లక్షలవుతోందన్న సమాచారం తెలిశాక జనం తిట్టిపోయకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంత అవసరం అని కొంత మంది విమర్శిస్తోంటే.. అంతఖర్చుపెట్టి ఇక్కడకొచ్చి ఆయన చేసేదేముందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాళ్లు మరికొందరు.
ఆంధ్రరాష్టం అప్పుల గురించి ఆర్థిక పరిస్థితి గురించి దేశమంతా తెలిసిందే. ఈ తరుణంలో జగన్ అంత విలాసవంతమైన భవంతిని అన్ని వందల కోట్లు ఖర్చుచేసి నిర్మించడం ఎంత వరకూ కరెక్ట్ అని పలువురు ఉద్యోగులు సైతం విమర్శిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటానికి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచనా వారిలో మొదలైంది.