ఈ కరోనా కాలంలో చూద్దామంటే సినిమాలే కరవయ్యాయి. ఓటీటీ వేదికగా ఉన్నవాటిలో ఆణిముత్యాలను ఎంచుకుని చూడటమే మంచిది. వాటిలో ఓ మళయాళ ఆణిముత్యం కుంబలంగి నైట్స్ సినిమా. కేరళలోని కుంబలంగి అనే మత్స్యకార పల్లెలో జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. మనసుకు హత్తుకునేలా చెప్పగలిగితే ఎలాంటి కథనైనా ప్రేక్షకులు ఆదరిస్తారనటానికి ఉదాహరణ ‘కుంబలంగి’ నైట్స్ సినిమా.
కథేంటి? : ఇది ప్రధానంగా నలుగురు అన్నదమ్ముల నడుమ సాగే కథ. ఓ పాడుబడిన భవంతిలో ఈ అన్నదమ్ములు ఉంటారు. షాజీ, బోనీ, బాబీ… అనే ఈ అన్నదమ్ములకు ఒకరంటే ఒకరికి పడదు. ఏ పనీ చేయరు. పెద్దవాళ్లిద్దరూ తరచూ తగాదాలు పడుతుంటే భరించలేక మూడో సోదరుడు విడిగా వెళ్లిపోయి ఉంటాడు. ఇంట్లో ఆడవాళ్లు లేకపోతే ఎలా ఉంటుందో వీరి జీవితం అలానే ఉంటుంది. అదే ఊళ్లో ఇంకో ధనవంతుల కుటుంబం కూడా ఉంటుంది. ఆ ఇంటి అల్లుడు అహంకారి. అందరి మీదా పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు.
అతని మరదలికీ, బాబీకీ మధ్య ప్రేమ పుడుతుంది. అది ఆమె బావకు నచ్చదు. అలాగే పెద్దవాడైన షాజీ కి కూడా ఓ మహిళతో అనుబంధం ఏర్పడుతుంది. తన కారణంగా తన స్నేహితుడు చనిపోయాడని తెలుసుకుని బిడ్డతల్లి అయిన అతని భార్యకు తన ఇంట్లో ఆశ్రయమిస్తాడు. రెండో సోదరుడు ఓ విదేశీయురాలిని పెళ్లిచేసుకుంటాడు. ఇలా ఆ ఇంట్లో ఆడవాళ్ల ప్రవేశంతో ఆ కుటుంబంలో చాలా మార్పులు వస్తాయి. భిన్నధ్రువాలుగా ఉన్న అన్నదమ్ములంతా ఒకటవుతారు. స్థూలంగా ఇదీ కథ.
ఎలా తీశారు? : సినిమా ప్రథమార్థమంతా సాఫీగా సాగిపోతుంది. ప్రథాన కథ ద్వీతీయార్థంలో ఉంటుంది. అన్నదమ్ములంతా ఒక్కటవడంతో సినిమా ముగుస్తుంది. కథ కన్నా కథనంతోనే ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా ద్వార తెరకు పరిచయమైన అన్నా బెన్ నటన ఈ సినిమాకు ప్రథాన ఆకర్షణ. సినిమా మధ్యలో ప్రవేశించే అన్నాబెన్ బావ పాత్ర చాలా వెరైటీగా సాగుతుంది. వేర్వేరు షేడ్స్ లో ఈ పాత్ర ఉంటుంది.
హైలైట్స్: అన్నదమ్ముల మధ్య సంబంధ బాంధవ్యాలు, పాత్రలు మలచిన తీరు, కెమెరా పనితనం, అన్నాబెన్ నటన, దర్శకత్వం ప్రతిభ. ఈ చిత్రానికి గాను దర్శకుడు మధు గొల్లపూడి శ్రీనివాస్ పురస్కారం కూడా అందుకోవడం విశేషం. ఇందులో మరో హైలైట్ ఫాహద్ ఫాజిల్ నటన. ఓసీడీ తరహా పాత్ర ఇది. ఈ సినిమా తర్వాత ఫాహద్ ఫాజిల్ నటుడిగా స్టార్ డమ్ సాధించాడు.
నటీనటులు: ఫాహద్ ఫాజిల్, షానే నిగమ్, సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భసి, ఆర్జే రమేష్ తిలక్, అన్నాబెన్.
దర్శకత్వం: మధు సి. నారాయణన్.
ఒక్కమాటలో: అపురూప కళాఖండం. ఫీల్ గుడ్ సినిమా.
ఎక్కడ చూడాలి? : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 4/5
– హేమసుందర్ పామర్తి











