పసుపు బోర్డు ఏర్పాటుపై ఢిల్లీ బీజేపీ పెద్దల తీరుతో నిజామాబాద్ ఎంపీ ఇరకాటంలో పడ్డారు. నిజామాబాబాద్‌లో పసుపు బోర్డు తెస్తాననే ప్రధాన హామీ ఇచ్చి గెలిచిన బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట తప్పారని, సుంగధ ద్రవ్యాల రీజనల్ కార్యాలయాల ఏర్పాటుతో సరిపెడుతున్నారని అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్‌లు విమర్శలు మొదలు పెట్టాయి. కౌంటర్‌గా ఎంపీ ధర్మిపురి అర్వింద్ ప్రతి విమర్శలు చేస్తుండడంతో పసుపుబోర్డు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుపై సోమవారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయడంతో ఈ విమర్శలు మొదలయ్యాయి. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదంటూ కేంద్రం పార్లమెంటులో స్పష్టం చేయడం, పసుపు బోర్డుకు బదులు.. సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం కేంద్ర వాణిజ్యశాఖ, స్పైసెస్ బోర్డు రీజనల్ కార్యాలయాన్ని నిజామాబాద్‌లో ఏర్పాటు చేశామని, పసుపు, ఇతర సుంగధ ద్రవ్యాల ఎగుమతికి వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో బోర్డు కార్యాలయాలు ఉన్నాయని వెల్లడించడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది.
సురేష్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు..
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. పసుపు, ఇతర సుంగధ ద్రవ్యాల ఎగుమతికి ప్రాంతీయ బోర్డు కార్యాలయం ఉన్నందు నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టే ఆలోచన ఏదీలేదని ఆయన ప్రకటించారు. ఇక మంగళవారం కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పసుపు పంట విస్తీర్ణం ఎక్కువగా ఉన్న నిజామాబాద్ ప్రాంతంలో పసుపు బోర్డు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 50 శాతం నిజామాబాద్ నుంచే ఉత్పత్తి అవుతుందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రకాష్ జవదేకర్ కూడా హామీ ఇచ్చారని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి గుర్తు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా సమాధానమిస్తూ.. పేరు కావాలా…ప్రయోజనం కావాలా అని వ్యాఖ్యానించారు. పసుపు కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒకటని… అందుకే అన్నింటికి కలిపి సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేశామని బదులిచ్చారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీలు స్పష్టత ఇవ్వాలని కోరగా మంత్రి ఆ సమయం ఇది కాదన్నారు.
Must Read ;- రేవంత్ స్కెచ్‌కు.. కల్వకుంట్ల కవిత వర్గంలో హ్యాపీ
అర్వింద్ మెప్పిస్తారా..
కాగా గత ఎన్నికల్లో పుసుపు బోర్డు ఏర్పాటు, నిజాం షుగర్స్ పనరుద్దరణ అంశాలే టీఆర్ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్ కుమార్తె ఓటమికి కారణమనే అంచనాలున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 186 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 145మంది రైతులే ఉన్నారు. 2014లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు తీసుకురావడంలో విఫలమయ్యారని చెబుతూ.. అందుకు నిరసనగా రైతులు నామినేషన్లు వేశారు. అయితే ఈ నామినేషన్ల వెనుక పలు కోణాలూ తెరపైకి వచ్చాయి. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ కుమార్ కల్వకుంట్ల కవిత ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన డీఎస్ కుమారుడు ధర్మపురి అర్వింద్ గెలిచారు. 70 వేల ఓట్ల మెజార్టీతో అర్వింద్ గెలుపొందారు.
తరువాతి కాలంలోనూ పసుపు బోర్డు విషయంపై ఆందోళనలు, నిరసనలు తలెత్తాయి. తరువాతి కాలంలో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది. గతంలోనూ ఈ హామీ వచ్చినా పసుపు బోర్డు కావాలని అప్పటి ఎంపీ కవిత పట్టుబట్టారని టీఆర్ఎస్ చెబుతోంది. గత ఏడాది ఇదే ప్రాంతీయ బోర్డు ఎక్స్ టెన్షన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. పసుపు బోర్డు కంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించేందుకు వీలవుతుందని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించగా, పసుపు బోర్డు తేకుండా.. ఇతరత్రా కార్యాలయాలు తెచ్చి రైతులను మోసం చేస్తున్నారని టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు విమర్శిస్తున్నాయి. ఎలాంటి ధరల నిర్ణయాత్మక అధికారాలు లేని ఎక్స్‌టెన్షన్ ఆఫీస్ వల్ల ఉపయోగం లేదని విమర్శించారు. ఓవైపు పసుబోర్డు కంటే ఎక్కువ సేవలు అందించేందుకు ఈ రీజనల్ బోర్డు ఉపయోపడుతుందని బీజేపీ ఎంపీ అర్వింద్ చెబుతుండగా, ఎలాంటి ఉపయోగం ఉండదని టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు చెబుతున్నాయి. మొత్తం మీద ఈ అంశంపై రైతుల్లోనూ కొంత గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా.. సిట్టింగ్ ఎంపీగా ఉన్నందున అర్వింద్ ఈ విషయంలో రైతులను మెప్పించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఎంపీ అర్వింద్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్‌కు బాకా ఊదుతున్నారని విమర్శించారు.
33 శాతం ఇక్కడి నుంచే..
దేశంలో అత్యధికంగా పసుపు పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లోనూ సాగు చేస్తుండగా 2019-20లో తెలంగాణలో 55,444 హెక్టార్లలో పసుపు సాగు చేశారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న పసుపులో మూడింట ఒకవంతు రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతోంది. 2019-20లో దేశవ్యాప్తంగా 11.53లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి కాగా ఇందులో తెలంగాణ వాటా 3.865 లక్షల టన్నులు (33.5 శాతం)గా ఉంది. హెక్టారుకు సగటున 6.9టన్నుల పసుపు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా.
Also Read ;- అర్వింద్ బాల్య వితంతువుగా మారుతావా?: రేవంత్