హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని లోక్‌సభలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. లోక్‌సభలో జమ్మూకశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై చర్చలో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై,చెన్నై, అహ్మదాబాద్, లక్నో ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. కాగా దీనిపై భిన్నమైన వాదనలు తెరపైకి వస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టాలంటే..
రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ మార్గాలను గండికొట్టడం ద్వారా కేంద్రం పాలనా పగ్గాలను తన చేతుల్లోకి తీసుకోవడం కోసం ఈ వ్యూహం ఉందని, ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టాలంటే ఇలాంటి చర్యలను జాతీయ పార్టీలు అమలు చేసేందుకు అవసరమైనప్పుడు సిద్ధం అవుతాయనే విశ్లేషణలూ ఉన్నాయి. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలు ఆ రాష్ట్రాలకు ఆదాయ వనరులు ఇచ్చే బంగారుబాతుల్లాంటివని చెప్పవచ్చు. దక్షిణాదిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలే కీలకం. రాజకీయ కోణంలో ఆలోచించినా ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంది. జాతీయ పార్టీలు సైతం సదరు ప్రాంతీయ పార్టీలతో సర్దుబాట్లు చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇలాంటి చర్చలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు అమలు చేయకపోయినా..అమలు చేస్తారేమోనన్న భయం కల్పించడం కూడా వ్యూహంలో భాగం కావచ్చని చర్చ నడుస్తోంది. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. కేవలం ఆ భయం కల్పించడంలో భాగంగా చేసే చర్చ తీవ్రమైనప్పపుడు రాజకీయంగా సదరు పార్టీలకు చాలా నష్టం వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
బీజేపీకి కౌంటర్..
ఇక మరో చర్చ ప్రకారం చూస్తే..తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. ఇన్నాళ్లు టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర విభజన జరిగి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరున్నరేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ గతంలో చూపినంత ప్రభావం ఇప్పుడు చూపే అవకాశం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా.. అప్పటికి ఇప్పటికి పరిస్థితి మారిందన్న చర్చ నడుస్తోంది. అదే సమయంలో బీజేపీ హిందూత్వను తెరపైకి తెచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ అవే అంశాలను తెరపైకి తెచ్చింది. బండి సంజయ్ కామెంట్లు, కౌంటర్‌గా ఓవైసీలు చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్‌లో రాజకీయ వాతావరణాన్ని టెన్షన్‌లోకి నెట్టాయి. ఆ ఎన్నికల్లో రెండోస్థానంలో బీజేపీ నిలిచింది. ఎంఐఎం మూడో స్థానానికి పడిపోయింది. ఎంఐఎం కోర్ ఏరియాలోకి వెళ్లేందుకు కూడా బీజేపీ యత్నిస్తోందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ దూకుడుకు చెక్ పెట్టాలంటే..హైదరాబాద్ చేజారుతుందనే ప్రచార అంశాన్ని ఎంఐఎం ఎంచుకుందని చెబుతున్నారు. తద్వారా కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీతో పాటు రానున్న కాలంలో ఏ జాతీయ పార్టీని నమ్మలేని విధంగా చర్చ జరపాలనే వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది.
రెండో రాజధానిగా..
కాగా దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ పేరు ప్రతిపాదనలో ఉందని రెండేళ్ల క్రితం చర్చ నడిచింది. ఇటీవలే పశ్చిమ బంగ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమత బెనర్జీ కూడా ఈ అంశానికి సంబంధించి పలు కామెంట్లు చేశారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం..ఇలా నాలుగు రాజధానులు ఏర్పాటు చేయాలని, ఒకే రాజధాని వద్దని మమత వ్యాఖ్యానించారు. మొన్న బడ్జెట్ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా పరోక్షంగా ఇలాంటి కామెంట్లే చేశారు. జమిలి ఎన్నికలు జరిగితే దక్షిణ భారతదేశ డిమాండ్ తెరపైకి వస్తుందని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. రెండో రాజధానిగా చేయాలనుకుంటే..కచ్చితంగా హైదరాబాద్ కేంద్రం చేతుల్లోకి వెళ్తుందని, అయితే రెండో రాజధాని ప్రతిపాదన ఇప్పుడు లేదని కొందరు నాయకులు చెబుతున్నారు.
బీజేపీ చెప్పిందే ఎంఐఎం చెబుతోందా..
ఇక ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ చెప్పిందే ఎంఐఎం చెబుతోందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచనను బీజేపీ ప్రభుత్వం చేసినా..తాము ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. ఇక అసద్ వ్యాఖ్యలపై సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. లోక్‌సభలోనే ఓవైసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి ఆధారం, ఎలాంటి చర్చ లేకుండానే ఓవైసీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారని, కేంద్రానికి అలాంటి ఆలోచనే లేదని, కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. మొత్తం మీద హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఈ చర్చ నడిచింది. తరవాత 2017-18 మధ్య కాలంలోనూ ఈ చర్చ నడిచింది. దేశానికి రెండో రాజధాని తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.