నరసరావు పేట ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నేత లావు కృష్ణదేవరాయలు పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన త్వరలో టీడీపీలో చేరతారని సమాచారం. టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అని, సరైన సమయం చూసి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఎంపీ కృష్ణదేవరాయలు వైఎస్ఆర్ సీపీలో ముందు నుంచి అంత చురుగ్గా లేని సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అని ప్రకటించిన తర్వాత అమరావతి రైతులు చేసిన నిరసనలకు కూడా కృష్ణదేవరాయలు మద్దతు తెలిపారు. వారి శిబిరాల వద్దకు వెళ్లి కూర్చున్న ఘటనలు కూడా ఉన్నాయి.
ఆ తర్వాత ఎంపీ కృష్ణదేవరాయలు టీడీపీ నేతలతో వివిధ సందర్భాల్లో సన్నిహితంగా ఉన్నట్లుగా కనిపించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని చాలా సందర్భాల్లో ఊహాగానాలు వచ్చాయి. ఈ ఏడాది జులైలో ఈ ప్రచారం బాగా జరిగింది. గత జులైలో శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు చనిపోయినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించడానికి నారా లోకేష్ వెళ్లారు. అదే సమయంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా అక్కడికి వచ్చారు. కాసేపట్లోనే లోకేష్ ను పలకరించేందుకు ఎంపీ ఆయన దగ్గరికి వెళ్లారు. లోకేశ్ తో చేతులు కలిపి సన్నిహితంగా కనిపించారు. దీంతో వీరిద్దరూ కాసేపు పలకరించుకున్నారు.
ఓ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ సీపీ అన్నట్లుగా రాష్ట్రంలో ఉంటే గతేడాది జులైలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో వైఎస్ఆర్ సీపీ ఎంపీ కృష్ణదేవరాయలు టీడీపీ ఎంపీలతో కనిపించారు. ఢిల్లీలోని ఎంపీ కేశినేని నాని నివాసానికి వెళ్లి.. అక్కడ టీడీపీకి చెందిన ఎంపీలు కేశినేని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడులతో చర్చించారు.
అసలు కారణం ఇదేనా?
లావు కృష్ణదేవరాయలు పార్టీకి దూరంగా ఉండడానికి ప్రధాన కారణం అంతర్గత విభేదాలు అని తెలుస్తోంది. తన పార్లమెంట్ నియోజకవర్గం నరసాపురం పరిధిలోని చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి విడదల రజినితో అభిప్రాయ బేధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇరు వర్గాలు కొట్లాటకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంపీ కారును ఎమ్మెల్యే రజినీ వర్గీయులు అడ్డుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరి పేటకు చెందిన వైసీపీ నేత మర్రి రాజశేఖర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే రజినీ కొంతకాలంగా అసహనంతో ఉన్నారని టాక్. దీనివల్లే ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయని చెబుతున్నారు.